Begin typing your search above and press return to search.

పాక్ మీద అమెరికా కోపం విలువ రూ.1.4ల‌క్ష‌ల కోట్లు..?

By:  Tupaki Desk   |   3 March 2019 9:44 AM GMT
పాక్ మీద అమెరికా కోపం విలువ రూ.1.4ల‌క్ష‌ల కోట్లు..?
X
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అంత‌ర్జాతీయంగా జ‌రిగే ప‌రిణామాల వెనుక కార‌ణం మ‌రేదో ఉంటుంద‌న్న నానుడి నిజం చేసేలా తాజా అంశం ఉంద‌ని చెప్పాలి. ఇటీవ‌ల భార‌త్ - పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో భారత గ‌గ‌న‌త‌లంలోకి పాక్ యుద్ధ విమానాలు దూసుకురావ‌టం.. వాటిని తిప్పి కొట్టేందుకే భార‌త్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాత‌త‌రం మిగ్ ల‌ను వాడ‌టం.. వాటిని త‌రిమికొడుతూ వెళ్ల‌టం తెలిసిందే.

ఈ క్ర‌మంలో పాక్ కు చెందిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని భార‌త్ కు చెందిన వైమానిక ద‌ళం కూల్చి వేయ‌టం తెలిసిందే. ఈ విష‌యాన్ని పాక్ నో అంటే నో చెప్ప‌టం.. చివ‌ర‌కు కొన్ని ఆధారాలు వెలుగు చూసిన త‌ర్వాత పాక్.. నిజ‌మేన‌ని ఒప్పుకుంది. ఇక్క‌డితో ఇష్యూ ముగిసిపోవ‌టం కాదు.. అస‌లు క‌థ మొద‌లైంద‌ని చెప్పాలి. ఎప్ 16 వాడిన పాక్ మీద అమెరికా కారాలు మిరియాలు నూర‌టం మొద‌లెట్టింది.

పాక్ ఒక యుద్ధ విమానాన్ని వినియోగిస్తే.. దాన్ని మీరెందుకు ఉప‌యోగించారంటూ అమెరికా ఎందుకు అడిగిన‌ట్లు? అన్న ప్ర‌శ్న కొంద‌రికి వ‌చ్చింది. ఎంతైనా ప్ర‌పంచ పెద్ద‌న్న కాబ‌ట్టి.. ఏ విష‌యాన్ని అయినా ఎవ‌రైనా అడ‌గొచ్చ‌న్న‌ట్లుగా కొంద‌రు స‌ర్ది చెప్పుకున్నారు. కానీ.. అస‌లు విష‌యం లెక్క తేల్చాల‌న్న ఉద్దేశంతో కొంద‌రుఈ ఇష్యూ లోతుల్లోకి వెళ్లారు. దీంతో.. షాకింగ్ నిజాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

పాక్ మీద అమెరికా అగ్ర‌హం వెనుక భారీ వ్యాపార అంశం ఉంద‌న్న విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. అదేమంటే.. పాక్ ప్ర‌యోగించిన ఎఫ్ 16 యుద్ధ విమానాన్ని అమెరికాకు చెందిన లాక్ హీడ్ మార్టిన్ అనే సంస్థ త‌యారుచేస్తుంది. ఈ సంస్థ మామూలు సంస్థ కాదు. అతి పెద్ద యుద్ధ విమానాల సంస్థ‌గా పేరుంది. భారీ లాబీయిస్టులు ఈ కంపెనీ త‌ర‌ఫున ప‌ని చేస్తుంటారు. అమెరికాలో స‌బ్బులు.. ఆహార‌ప‌దార్థాల మాదిరే.. ర‌క్ష‌ణ రంగ ఉత్ప‌త్తుల్ని ప్రైవేటు సంస్థ‌లే త‌యారు చేస్తుంటాయి.

అలాంటి సంస్థ‌ల్లో లాక్ హీడ్ మార్టిన్ అతి పెద్ద‌ది. దాని రేంజ్ ఎంతంటే.. ప్ర‌పంచంలో అత్య‌ధికంగా ఆయుధాల్ని అమ్మ‌టంలో దానిక‌దే సాటిగా చెబుతారు. మొన్న పాక్ వాడిన ఎఫ్ 16 కూడా ఆ సంస్థ ఉత్ప‌త్తే. అయితే.. ఇప్పుడు లెక్క ఎక్క‌డ తేడా వ‌చ్చిదంటే.. ఎఫ్ 16 లాంటి అత్యాధునిక యుద్ధ విమానాన్ని పాత‌త‌రం మిగ్ బైస‌న్ పేల్చేయ‌టం.. దాని ధాటికి కుప్ప‌కూలిపోవ‌టంతో.. ఆ ఇమేజ్ లాక్ హీడ్ మార్టిన్ మీద ప‌డింది.

అదెలానంటే.. భార‌త్ లో ఆ సంస్థ మోడీ స‌ర్కారుకు పెద్ద డీల్ కుదుర్చుకోవాల‌ని త‌పిస్తోంది. ఎఫ్ 16ను పోలిన‌.. ఇంకాస్త వివ‌రంగా చెప్పాలంటే దాని అప్ గ్రేడ్ వెర్ష‌న్ కు సంబంధించిన యుద్ధ విమానాల్ని కొనాల‌ని భార‌త్ భావిస్తోంది. ఆ డీల్ విలువ దాదాపు రూ.1.4ల‌క్ష‌ల కోట్లుగా చెబుతున్నారు. ఈ త‌ర‌హా యుద్ధ విమానాల్ని 114 వ‌ర‌కు కొనుగోలు చేయాల‌ని భార‌త్ భావిస్తోంద‌ని.. అయితే.. పాత‌కాలం నాటి మిగ్ లు.. అత్యాధునిక యుద్ధ విమానాన్ని కూల్చేయ‌టంతో దాని సామ‌ర్థ్యం మీద కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

దీంతో.. మొన్న‌టి వ‌ర‌కూ ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించిన డీల్ విష‌యంపై భార‌త్ ఎక్క‌డ నో చెబుతుంద‌న్న ఆలోచ‌న‌లో స‌ద‌రు సంస్థ ఉంద‌ట‌. అందుకే పాక్ మీద అమెరికా క‌న్నెర్ర చేస్తోంది. అమెరికా దేనికైనా రెఢీ కానీ.. త‌మ వ్యాపార ప్ర‌యోజ‌నాలు దెబ్బ తింటాయంటే మాత్రం అస్స‌లు భ‌రింలేదు. అందుకే.. అన‌వ‌స‌రంగా ఎఫ్ 16 వాడి త‌ప్పు చేసిన‌ట్లుగా అమెరికా భావిస్తోంది. ఇంత జ‌రిగిన త‌ర్వాత కూడా లాక్ హీడ్ మార్టిన్ సంస్థ ఉత్ప‌త్తుల‌పైన భార‌త్ ఎంత‌టి న‌మ్మ‌కం ఉంచుతుంద‌న్న‌ది ఒక సందేహ‌మైతే.. అదే జ‌రిగితే.. ప్ర‌జ‌ల్లో ఎంత వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుందో చూడాలి.