Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ పై మ‌ళ్లీ అమెరికా ప్ర‌శంస‌లు

By:  Tupaki Desk   |   30 Dec 2017 4:26 AM GMT
కేటీఆర్‌ పై మ‌ళ్లీ అమెరికా ప్ర‌శంస‌లు
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ త‌న‌యుడు - రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ కు అగ్రరాజ్యం అమెరికా నుంచి ప్ర‌శంస‌లు ఆగ‌డం లేదు. ఇదంతా హైదరాబాద్‌ లో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ పెన్యూర్‌ సమ్మిట్ స‌క్సెస్ పుణ్యం. జీఈఎస్ స‌క్సెస్‌ పై ప‌లు వ‌ర్గాల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతుండ‌గా ఈ జాబితాలో తాజాగా మ‌రో అంశం జోడ‌యింది. కొద్దికాలం క్రితం జీఈఎస్ నిర్వ‌హ‌ణ ప‌ట్ల అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ త‌న‌య ఇవాంకా ట్రంప్ సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు వ్య‌క్తిగ‌తంగా ఆమె ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు లేఖ రాశారు. ఇందులో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శంసించ‌డం గ‌మ‌నార్హం. ఇదే కోవ‌లో తాజాగా మంత్రి కేటీఆర్‌ కు అమెరికా రాయబారి కెన్నెత్ ఐ జస్టర్ లేఖ రాశారు.

జీఈఎస్ ముగిసిన దాదాపు నెల త‌ర్వాత రాసిన లేఖ‌లో అమెరికా రాయ‌బారి మంత్రి కేటీఆర్‌ ను ప్రశంసించారు. హైదరాబాద్‌ లో జీఈ సదస్సు అద్భుతంగా నిర్వహించినందుకు ఆయన కొనియాడారు. జీఈఎస్‌ సదస్సు విజయవంతమైనందుకు కెన్నెత్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాట్ల వల్లే సదస్సు అర్థవంతంగా సాగిందని కెన్నెత్ కితాబిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కెన్నెత్ కొనియాడారు. సాంకేతికత - ఆవిష్కరణల కేంద్రంగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్నారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెట్టుబడి విధానాలు దేశానికే ఆదర్శమని కెన్నెత్ స్పష్టం చేశారు. సదస్సులో కేటీఆర్‌ ను కలిసే అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా కెన్నెత్ కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, కొద్దికాలం క్రితం రాసిన లేఖ‌లో జీఈఎస్ సంద‌ర్భంగా తెలంగాణ ఇచ్చిన ఆతిథ్యానికి ఈ లేఖ‌లో ఇవాంకా కృతజ్ఞతలు చెప్పిన సంగ‌తి తెలిసిందే. `జీఈఎస్ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలికన తీరు అనిర్వచనీయం - స్పూర్తిదాయకం. భవిష్యత్‌ లో అవకాశం దొరికితే మళ్లీ హైదరాబాద్‌ కు వస్తాను` అని అందులో పేర్కొన్నారు. జీఈఎస్ సాగుతున్న స‌మ‌యంలో ఫలక్‌ నామ ప్యాలస్‌ లో తెలంగాణ ప్రభుత్వం అందించిన కానుక గొప్ప అనుభూతిని కలిగించిందని ఇవాంకా సంతోషం వ్య‌క్తం చేశారు. ఈ లేఖ కార‌ణంగా తెలంగాణ ప్ర‌భుత్వం - టీఆర్ ఎస్ వ‌ర్గాలు ఖుష్ అవుతుండ‌టం గ‌మ‌నార్హం.

మ‌రోవైపు ఇవాంకా లేఖ‌కు కొద్దిరోజుల‌ ముందే...ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి జీఈఎస్ సదస్సును విజయవంతంగా నిర్వహించార‌ని ప్ర‌శంసించిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ వేదిక‌గా సాగిన ఈ స‌ద‌స్సును గ్రాండ్ స‌క్సెస్ చేశార‌ని ఇవాంకా త‌న‌తో వ్య‌క్తీక‌రించార‌ని ట్రంప్ ప్ర‌ధానితో చెప్పిన‌ట్లు పీఎంఓ వెల్ల‌డించింది.