Begin typing your search above and press return to search.

కరోనా వేళలో చైనాపై కొత్త లొల్లి షురూ చేసిన అమెరికా

By:  Tupaki Desk   |   11 April 2020 7:30 AM GMT
కరోనా వేళలో చైనాపై కొత్త లొల్లి షురూ చేసిన అమెరికా
X
లక్షల్లో కరోనా బాధితులుగా మారిన వేళ.. న్యూయార్క్ మహా నగరం శవాల దిబ్బగా మారుతూ.. అంత్యక్రియల విషయంలోనూ దారుణ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న వేళ.. అలాంటి సమస్యల పరిష్కారం మీద ఫోకప్ పెట్టని ఆగ్రరాజ్యం.. కొత్త పంచాయితీలకు తెర తీస్తోంది. ఇప్పటికే కరోనా ఎపిసోడ్ లో ట్రంప్ తీరు ఏ మాత్రం సరిగా లేదన్న వాదన వినిపిస్తున్న వేళ.. చైనా మీద తనకున్న అక్కసును సరికొత్త రీతిలో తెర మీదకు తెచ్చింది అమెరికా ప్రభుత్వం.

కరోనా వైరస్ తో తమ దేశాన్ని ఆగమాగం చేసినట్లుగా అమెరికా భావిస్తోంది. కరోనా తీవ్రతను గుర్తించటం.. దాన్ని కట్టడి చేయటంలో దొర్లిన తప్పుల్ని కప్పి పుచ్చుకునేందుకు అగ్రరాజ్యం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అమెరికా మార్కెట్లో టెలికం సేవల్ని అందిస్తున్న చైనా టెలికాంను బ్యాన్ చేస్తామన్న కొత్త బెదిరింపునకు దిగుతోంది అగ్రరాజ్యం.

చైనాలో రెండో అతి పెద్దదైన చైనా టెలికం అమెరికా మార్కెట్లోనూ పెద్ద వాటానే ఉంది. అయితే.. భద్రత.. న్యాయపరమైన ముప్పు ఉందంటూ వాదిస్తున్న అమెరికన్ ప్రభుత్వం.. చైనా టెలికం మీద చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా చైనా టెలికాంకు ఇచ్చిన అనుమతుల్ని రద్దు చేయాలన్న యోచనలో ఉంది.

అదే జరిగితే.. రెండు దేశాల మధ్య కొత్త లొల్లి షురూ అయినట్లే. ఒకవేళ అమెరికాలోని ట్రంప్ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకుంటే.. చైనా టెలికాం సర్వీసుల్ని వాడే కోట్లాది మంది అమెరికన్లకు ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇదిలా ఉంటే.. వ్యాపార అంశాల్ని రాజకీయం చేయటం ఏ మాత్రం సరికాదన్న వాదనను వినిపిస్తోంది చైనా. ట్రంప్ సర్కారు తీరును డ్రాగన్ దేశం తీవ్రంగా తప్పు పడుతోంది. మరీ అంశంలో ట్రంప్ సర్కారు ఎలా వ్యవహరిస్తారన్నదే అసలు ప్రశ్న.