Begin typing your search above and press return to search.

అవకాశం వస్తే రాజకీయాల్లోకి అడుగుపెడతా..

By:  Tupaki Desk   |   17 July 2020 2:30 PM GMT
అవకాశం వస్తే రాజకీయాల్లోకి అడుగుపెడతా..
X
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం గత ఏడాది నుంచి చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. సింహాచలం దేవస్ధానంతో పాటు మాన్సాస్ ట్రస్ట్ బోర్డు చైర్ పర్సన్‌గా దివంగత ఆనంద గజపతిరాజు వారసురాలిగా సంచయిత గజపతిరాజు నియమితులయ్యారు. అయితే, తానే ఆ ట్రస్టుకు అసలైన వారసుడినంటూ మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు వాదిస్తున్నారు. ఆ ట్రస్టుకు తానే అసలైన వారసురాలినని సంచయిత గజపతిరాజు దూకుడుగా వ్యవహరిస్తూ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తన నియామకం చంద్రబాబుకు, బాబాయ్ అశోక్ గజపతి రాజుకు ఇష్టం లేదని, అందుకే, తనపై బురద జల్లుతున్నారని ఆరోపిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా అశోక గజపతి రాజుపై దివంగత ఆనంద గజపతిరాజు, సుధాల కుమార్తె ఊర్మిళా గజపతిరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మరణానంతరం అశోక గజపతిరాజు అనేక రాజకీయ కుట్రలకు ప్రయత్నించారని ఆరోపించారు. సింహాచలం దేవస్థానం, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో బాబాయ్ రాజకీయం చేయడం తమను ఎంతో బాధించిందని అన్నారు. తన తండ్రి ఆశయాల సాధనకు కృషి చేస్తున్నానని, భవిష్యత్‌లో అవకాశం వస్తే తప్పకుండా రాజకీయాల్లోకి అడుగుపెడతానని ఊర్మిళ తెలిపారు.

తన తండ్రి మరణించేటప్పటికి తన వయసు 16 సంవత్పరాలని, అందుకే ట్రస్ట్ బాధ్యతలు చేపట్టడానికి అర్హత లేదని బాబాయ్ దూరంపెట్టారని ఊర్మిళ చెప్పారు. ప్రజల కోసమే ఇంజినీరింగ్ కాలేజీలు, మాన్సాస్ ట్రస్ట్ ను ఆనంద గజపతి రాజు స్థాపించారని, ఆయన బ్రతికి ఉంటే తప్పనిసరిగా మెడికల్ కాలేజీ నిర్మించి ఉండేవారని గుర్తు చేశారు. తన బాబాయి ఆశోక్ గజపతిరాజు తన తండ్రి, తాతల ఆశయాలతో ట్రస్ట్ ను కొనసాగించలేదని ఆరోపించారు. బాబాయ్ ని చైర్మన్‌గా నియమించినపుడు టీడీపీ ప్రభుత్వం తమను సంప్రదించలేదని ఆరోపించారు. ఆ జీవోతో తమను ట్రస్ట్‌కు, సింహాచలం దేవస్థానం వేడుకలకు దూరం చేశారని ఆరోపించారు. తాతగారు, నాన్నగారి అడుగుజాడల్లో నడుస్తానన్న ఊర్మిళ...అవకాశం వస్తే తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడతానని అన్నారు.