Begin typing your search above and press return to search.

ఇవీ.. రోహిత్ ఇష్యూ అప్ డేట్స్

By:  Tupaki Desk   |   20 Jan 2016 12:26 PM GMT
ఇవీ.. రోహిత్ ఇష్యూ అప్ డేట్స్
X
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న పీహెచ్ డీ విద్యార్ధి రోహిత్ అంశంపై బుధవారం పలు పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిణామాలు చూస్తే..

1. రోహిత్ వ్యవహారంపై కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రోహిత్ ఆత్మహత్యపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీతో భేటీ అయిన ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడి.. రోహిత్ అంశంపై తమ పాత్ర ఏమీ లేదని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటన దళితులు.. దళితేతరులకు మధ్య జరిగిన ఘటన ఏ మాత్రం కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేశారు.

2. రోహిత్ వ్యహారంపై కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ విస్మయం వ్యక్తం చేశారు. రోహిత్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రకటించిన ఆయన.. తనకు అందిన వినతి పత్రాల్ని సంబంధిత శాఖకు పంపాను తప్పించి తన పాత్రేమి లేదన్నారు.

3. రోహిత్ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ నేత స్పందించారు. తాజాగా ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని సందర్శించి.. ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రోహత్ ఆత్మహత్య దురదృష్టకరంగా అభివర్ణించారు. తాజాగా జరిగిన ఘటనపై సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.

4. రోహిత్ ఆత్మహత్యకు తన బాధ్యత లేదని వర్సిటీ వీసీ అప్పారావు తేల్చి చెప్పారు. తనను రాజీనామా చేయాలని వస్తున్న డిమాండ్లను ఆయన తోసి పుచ్చారు.

5. రోహిత్ ఆత్మహత్యపై పలువురు నేతలు.. రాజకీయ పక్షాలు స్పందిస్తుంటే.. మరోవైపు ఏబీవీపీ మరో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. రోహిత్ దళితుడు అంటూ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని.. అతడు వడ్డెర కులానికి చెందిన వాడని.. అలాంటి వ్యక్తిని దళితుడని ఎలా చెబుతారని ప్రశ్నించటం ఈ వ్యవహారం మరో మలుపు తిరిగినట్లైంది.

6. రోహిత్ ఆత్మహత్య.. అనంతరం అతని కులంపై వివాదం చెలరేగుతున్న సమయంలోనే తెలంగాణ పోలీసులు.. రోహిత్ స్వగ్రామమైన ఏపీలోని గుంటూరు జిల్లా గురజాలకు వెళ్లి.. రోహిత్ కుటుంబ సభ్యుల్ని విచారిస్తున్నారు.

7. రోహిత్ ఆత్మహత్యకు కారణం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కారణం అంటూ ఏఎస్ఎఫ్ఐ నేతలు.. ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. ముట్టడిని భగ్నం చేసినట్లుగా పోలీసులు చెబుతుంటే.. మరోవైపు విద్యార్థి సంఘం మాత్రం కేంద్రమంత్రి ఇంటిని ముట్టడించినట్లుగా పేర్కొంటున్నాయి.

8. రోహిత్ ఆత్మహత్యపై సీపీఎం తీవ్రస్థాయిలో మండిపడింది. సదరు విద్యార్థి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు.