Begin typing your search above and press return to search.

కోహ్లి సహా.. టి20 ప్రపంచ కప్ ఆడేదెవరో తేలిపోయింది

By:  Tupaki Desk   |   9 Aug 2022 8:31 AM GMT
కోహ్లి సహా.. టి20 ప్రపంచ కప్ ఆడేదెవరో తేలిపోయింది
X
ఆస్ట్రేలియాలో ఈ ఏడాది నవంబరులో జరిగే టి20 ప్రపంచ కప్ లో ఆడే భారత జట్టు సభ్యులెవరో తేలిపోయింది. అత్యంత పేలవ ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి సహా ఎవరెవరు జట్టులో ఉంటారో ఖరారైంది. వాస్తవానికి కోహ్లి ఫామ్ రీత్యానే కాదు.. కుర్రాళ్లు దూసుకొస్తున్నందున జట్టులో చోటు ఉంటుందా? ఉండదా? అనే సందిగ్ధం నెలకొంది. కానీ, అదేమీ లేకుండానే అతడికి జట్టులో స్థానం ప్రత్యేకమని తెలిసిపోయింది. ఇక గాయాలతో సతమతం అవుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫిట్ నెస్ సాధించడంతో పోటీ రసవత్తరంగా మారింది.

వయా ఆసియా కప్

ఆసియా కప్ ఈ నెల 27 నుంచి జరుగనుంది. ఈ నెల 28న ఆదివారం భారత్ తో పాకిస్థాన్ తలపడనుంది. దీనికోసం టీమిండియాను సోమవారం ప్రకటించారు. తాజాగా వెస్టిండీస్‌తో ముగిసిన వన్డేలు, టి20 సిరీస్‌ నుంచి కోహ్లి విశ్రాంతి కోరాడు. అయితే, అతడు ఆసియా కప్ జట్టులోకి పునరాగమనం చేశాడు. దీంతోనే కోహ్లికి పొట్టి ఫార్మాట్ లో చోటు ఉంటుందా? ఉండదా? అన్న సందిగ్ధత తొలగింది.

ఇక రాహుల్ మూడు నెలలుగా హెర్నియా సర్జరీ, ఆ తర్వాత కరోనా కారణంగా జట్టుకు దూరమయ్యాడు. రోహిత్‌ నాయకత్వంలోని జట్టుకు రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌. ఈ టోర్నీకి 15 మందితో జట్టును ప్రకటించారు. వెన్ను గాయం కారణంగా ప్రధాన పేసర్ బుమ్రా జట్టుకు దూరమయ్యాడు. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హర్షల్‌ పటేల్‌ పేరునూ పరిశీలించలేదు.

శ్రేయస్‌ అయ్యర్‌, అక్షర్‌ పటేల్‌, తొడకండరాల గాయం నుంచి కోలుకుంటున్న దీపక్‌ చాహర్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితాలో ఉంచారు. ఈ అయిదుగురితో పాటు.. ఆసియా కప్‌నకు ఎంపికైన రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హుడా, రిషబ్‌ పంత్‌, దినేశ్‌ కార్తీక్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అశ్విన్‌, చాహల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేశ్‌ఖాన్‌ తో కలిపి మొత్తం 20 మంది.

ఈ 20 మంది నుంచే

నవంబరులో జరిగే టి20 ప్రపంచ కప్ నకు ఈ 20 మంది సభ్యుల నుంచే జట్టును ఎంపిక చేయనున్నారు. వీరిని కోచ్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీ20 ప్రపంచకప్‌ కోర్‌ బృందంగా గుర్తించారు. వీరినుంచే ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేస్తారు. మహా అయితే, ఒకటీ, అరా మార్పులు ఉండొచ్చు. అంటే.. కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ సంజూ శాంసన్, 150 కిమీ వేగంతో బంతులేసే కశ్మీరీ పేసు గుర్రం ఉమ్రాన్ మాలిక్, హైదరాబాదీ పేసర్ మొహమ్మద్ సిరాజ్ లకు చోటు కష్టమేనని తేలిపోయింది.

కోహ్లికి చివరి చాన్సా?

మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి టి20 కెరీర్ భవితవ్యం ఆసియా కప్, ప్రపంచ కప్ తో తేలిపోనుంది. శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా, సంజూ శాంసన్ వంటి కుర్రాళ్లను కాదని అవకాశాలు దక్కించుకుంటున్న కోహ్లికి ఈ రెండు టోర్నీల్లో రాణించడం చాలా అవసరం. పొట్టి ఫార్మాట్ కు తగిన ఫిట్ నెస్ ఉన్నప్పటికీ.. వేగంగా పరుగులు చేయడం ముఖ్యం. అయితే, కోహ్లి అసలు పరుగులే చేయడం లేదు. దీపక్ హుడా, అయ్యర్ వేగంగా ఆడుతున్నారు. కాబట్టి.. కోహ్లి మళ్లీ మునుపటిలా పరుగులు సాధించాల్సి ఉంటుంది. లేదంటే టి20ల నుంచి ''బలవంతపు విశ్రాంతి'' పొందాల్సి వస్తుంది.