Begin typing your search above and press return to search.

గిల్లి నొప్పి వచ్చిందని అనడం ఏంటి కేటీఆర్ గారు?

By:  Tupaki Desk   |   30 April 2022 5:11 AM GMT
గిల్లి నొప్పి వచ్చిందని అనడం ఏంటి కేటీఆర్ గారు?
X
అవసరం లేకుండా గిల్లే గిల్లుడికి.. గాయపడినోడే కాదు.. గాయం చేసినోడికి సైతం నొప్పి కలుగుతుందన్న విషయం తొలిసారి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ కు బాగానే అర్థమైందని చెప్పాలి. విడిపోయి కలిసి ఉందాం? అన్న గొప్ప నినాదంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా ఆంధ్రోళ్లను కొంత జట్టుగా చేసుకోవటం.. విడిపోయిన తర్వాత ఎవరి బతుకులు వారివి అన్నట్లు కాకుండా.. కొన్ని సందర్భాల్లో నిందలు వేయటం.. మరికొన్ని సందర్భాల్లో చులకన చేసేలా మాట్లాడటం ఒక అలవాటుగా మారింది.

ఎలాంటి సందర్భం లేకుండా.. మరెలాంటి రాజకీయ ప్రయోజనం కోసం కాకుండా యధాలాపంగా వచ్చిన మాట కంటే కూడా తమ గొప్పతనాన్ని చాటి చెప్పుకోవటం కోసం.. పక్క రాష్ట్రాన్ని నాలుగు మాటలు అనేద్దామన్న చిన్నపాటి 'తుత్తి' మంత్రి కేటీఆర్ చేత నాలుగు మాటలు అనేలా చేసింది. అయితే.. తాను కెలికిన అంశం.. సింఫుల్ గా పోయేది కాదన్న విషయం ఆయనకు కాసేపటికే అర్థమైనట్లుగా ఉంది.

ఈ కారణంతోనే ఏపీ మంత్రులు.. నేతలు రియాక్టు అయినప్పుడు కౌంటర్లు ఇచ్చిన తెలంగాణ అధికారపక్షం నేతలు తర్వాత కామ్ గా ఉండటంతో రాజీ సందేశాన్ని అంతర్గతంగా పంపినట్లుగా చెప్పాలి. ఈ కారణంతోనే.. శుక్రవారం సాయంత్రం నుంచి ఏపీ అధికారపక్ష నేతలు సైతం తమ నోటికి తాళాలు వేసేశారు.

కేటీఆర్ వ్యాఖ్యలు చేసినంతనే ఏపీలోని అధికారపక్షానికి చెందిన సోషల్ మీడియా సైన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడి.. పోస్టులతో మోత మోగించారు. అలాంటి వారు సాయంత్రానికి చల్లబడ్దారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు శుక్రవారం అర్థరాత్రి కేటీఆర్ పెట్టిన ట్వీట్ తో తేలిపోయింది. కేటీఆర్ మాటలకు ఏపీ అధికారపక్ష నేతలు ఎవరికి వారు.. తమకుతోచిన రీతిలో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ అధికారపక్షాన్ని ఇరుకున పడేలా చేశాయి. లాగే కొద్దీ తాడు తెగటం తప్పించి.. మరేమీ లేదన్న విషయాన్ని గులాబీ దళం గుర్తించిందని చెబుతారు.

ఈ కారణంతోనే తెలివి తెచ్చుకున్న కేటీఆర్..తన పొలిటికల్ కెరీర్ లో ఎప్పుడు లేనంత వేగంగా.. తాను అన్న మాట మీద వెనక్కి తగ్గినట్లుగా చెబుతున్నారు. ఒక సమావేశంలో తాను అన్న మాటలతో ఏపీలోని తన స్నేహితులకు తెలీకుండానే కొంతబాధ కలిగించి ఉండొచ్చని.. తాను ఏపీ సీఎం జగన్ తో ఉన్న సోదర సమాన ప్రేమ గురించి గుర్తు చేసి.. రాష్ట్రం ఆయన నాయకత్వంలో డెవలప్ కావాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ తో ముక్తాయించి.. ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేశారని చెప్పాలి.

అయితే.. ఈ ఎపిసోడ్ నుంచి కేటీఆర్ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏమంటే.. అసలు గిల్ల కూడదు. ఒకవేళ గిల్లే ప్లాన్ ఉంటే.. గిల్లిచ్చుకున్నకోడికి నొప్పి వస్తుందని.. ఆ బాధతో ఏదో ఒకటి చేస్తాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. గిల్లేసి.. అయ్యో నొప్పి వచ్చిందా? లాంటి మాటలు ఏ మాత్రం సరికాదన్నది మంత్రి కేటీఆర్ గుర్తిస్తే మంచిది.