Begin typing your search above and press return to search.

ఏపీని రిపేరు చేసే మెకానిక్ ఎవరు...?

By:  Tupaki Desk   |   10 May 2022 12:30 AM GMT
ఏపీని రిపేరు చేసే మెకానిక్ ఎవరు...?
X
ఏపీలో సార్వత్రిక ఎన్నీకలకు చాలా టైమ్ ఉన్నా రాజకీయం చూస్తే మాత్రం కాక రేపుతోంది. అపుడే పొత్తులు, సీట్ల బేరాలు, రాయబారాలు ఇలా చాలా సీన్లు చకచకా కళ్ళ ముందే సాగిపోతున్నాయి. సరే ఇదంతా రాజకీయం. ఏపీలో వచ్చేసారి ఎవరు అధికారంలోకి వస్తారు అన్న దాని మీద నడిచే ఫక్తు పాలిటిక్స్ అది.

దానిసంగతి పక్కన పెడితే ఏపీ ఒక రాష్ట్రంగా ఇపుడు ఎలా ఉంది. దాని పరిస్థితి ఏంటి అన్నది కూడా చర్చగా ముందుకు వస్తోంది. ఏపీ అన్ని విధాలుగా ఈ రోజున ఇబ్బందుల్లో ఉంది. ఎక్కడ చూసినా అప్పులే తప్ప మరేమీ లేవు. నాడు విభజనతో లక్ష కోట్ల అప్పుతో ఏపీ ఏర్పడింది. చంద్రబాబు దానికి మరింత చేర్చి మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుగా మిగిల్చారు.

ఇక జగన్ వస్తూనే ఆ అప్పులను ఇబ్బడి ముబ్బడిగా తీసుకెళ్ళారు. చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే జగన్ దిగిపోయేనాటికి అప్పులు పదకొండు లక్షల కోట్లకు చేరుతాయట. దానికి అయ్యే వడ్డీలే రెండు లక్షల దాకా కడుతూ పోవాలట. ఇక ఇది అతి పెద్ద సవాల్ గానే చూడాలి.

అదే టైమ్ లో ఏపీలో పారిశ్రామిక రంగం లేదు, సేవా రంగం కూడా లేదు, ఐటీ సెక్టార్ మిణుకుమిణుకుమంటోంది. ఏ విధంగా చూసినా అభివృద్ధి లేమి ఉంది. మరి అలాంటి ఏపీని బాగు చేయాలీ అంటే రేపటి రోజున ఎవరు వచ్చినా అయ్యే పనేనా అన్నదే అతి పెద్ద ప్రశ్న. ఇక ఏపీకి ఆదాయాలు ఎంతలా వచ్చినా దానితో పాటే పెరిగిపోతున్న ఖర్చు. ఉద్యోగుల జీతాలు, నిరుద్యోగుల ఆశలు, ఎటూ ఏ పార్టీ పవర్ లో ఉన్నా ఉండే సంక్షేమ పధకాలు ఇలా అన్నీ చూసుకుంటూ ఏపీని నడిపించడం కష్టమే అన్న మాట వినిపిస్తోంది.

ఇపుడు ఉన్న పరిస్థితుల్లో ఏపీని రిపేర్ చేయడం ఎలాంటి మెకానిక్ కి అయినా కష్టమే అని అంటున్నారు. చంద్రబాబు కూడా ఏపీని కోలుకోలేని విధంగా దెబ్బ తీశారు అనే చెబుతున్నారు. మరి ఏపీని బాగు చేసేవారు ఎవరున్నారు. మార్పు అంటే వారు పోయి వీరు రావడమేనా, కుర్చీలు మార్చుకోవడమేనా లేక అభివృద్ధి దిశగా ఏపీని పరుగులు తీయించే నాయకత్వం వస్తుందా. ఇవన్నీ కూడా రేపటి రోజున జనాలు మనసులో పెట్టుకుని తీర్పు చెప్పాల్సిన అవసరం ఉందని అంతా అంటున్నారు.

ఏపీని పాలించడం ఈ సమయంలో చాలా కష్టం, ఢక్కా మెక్కీలు తిన్న వారు కూడా ఏపీని ఏలలేరు, రాజకీయ మేధావి ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలలో చెప్పాలీ అంటే ఏపీని మోడీ ఏలినా, లేక జో బైడెన్ వచ్చి ఇక్కడ కుర్చీలో కూర్చున్నా బాగు చేయడం కష్టమనే చెబుతున్నారు. మరి ఆ శక్తి సామర్ధ్యాలు ఎవరికైనా ఉన్నాయా. జవాబు కోసం వెతుక్కోవాల్సిందే.