Begin typing your search above and press return to search.

ఇవాంకా సరసన ఉపాసన.. మెగా ఫ్యామిలీ

By:  Tupaki Desk   |   28 Nov 2017 4:40 PM GMT
ఇవాంకా సరసన ఉపాసన.. మెగా ఫ్యామిలీ
X
అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు(జీఈఎస్)కు ఇవాంకా రావడంతో ఈ సదస్సుకు ఎక్కడలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఆ సదస్సులో పాల్గొనడమే గొప్పన్నట్లుగా తయారైంది. మామూలుగా అయితే, ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు జరిగినా ఎవరొస్తున్నారు, ఎవరు పాల్గొన్నారు అన్నది పెద్దగా సాధారణ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ, ఈ సదస్సుకు ఇవాంకా రావడం, కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నమెంటు - మీడియా విపరీతమైన హడావుడి చేయడంతో ఎక్కడలేని హైప్ ఏర్పడింది. దీంతో ఎంతో పాపులారిటీ ఉన్నవారు కూడా ఈ సదస్సులో పాల్గొనడాన్ని గొప్పగా ఫీలవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన కూడా ఆ సదస్సులో పాల్గొనగా ఆ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్త హోదాలో ఉపాసన ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇవాంకా కూర్చున్న తొలి వరుస తరువాత వరుసలో ఆమె కూర్చున్నారు. అయితే... ఈ ప్రోగ్రాం టీవీల్లో వస్తున్నప్పుడు ఇవాంకాను చూపించిన ప్రతిసారీ ఉపాసన కూడా టీవీల్లో కనిపించారు. అది కూడా ఇవాంకా పక్కన ఇంకొకరు, ఆ పక్కనే ఉపాసన ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఇంట్లో టీవీలో చూసిన మెగాస్టార్ చిరంజీవి - ఉపాసన భర్త రాంచరణ్‌ లు ఆ చిత్రాన్ని తీసి ఉపాసనకు వాట్సాప్‌ లో పంపించగా ఆమె దాన్ని ట్విటర్‌ లో షేర్ చేశారు.

‘‘మా స్వీట్ మామయ్య - మిస్టర్ సీ(భర్త రాంచరణ్) ఈ ఫొటోను నాకు టీవీలో వస్తున్న ఈ క్లిప్పింగ్ పంపించారు. మహిళా సాధికారితను ఎప్పుడూ విశ్వసించే వారికి ధన్యవాదాలు’’ అంటూ ఉపాసన ఆ క్లిప్పింగ్‌ తో పాటు కామెంట్ పెట్టారు. మెగా ఫ్యామిలీ అభిమానులు దాన్ని విపరీతంగా షేర్ చేస్తుండడంతో సోషల్ మీడియాలో బాగా తిరుగుతోంది.