Begin typing your search above and press return to search.

డాక్టర్ మీద చేయి వేస్తే లైఫ్ ఖతం?

By:  Tupaki Desk   |   4 Sep 2019 4:52 AM GMT
డాక్టర్ మీద చేయి వేస్తే లైఫ్ ఖతం?
X
కంటికి కనిపించే దేవుడిగా డాక్టర్ ను అభివర్ణిస్తుంటారు. అలాంటి వైద్యుల మీద ఇటీవల కాలంలో దాడులు పెరగటం తెలిసిందే. తమకు వైద్యం చేయలేదని.. రోగి ప్రాణాలు పోవటానికి ఆసుపత్రి.. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆసుపత్రులపై దాడులు చేయటం.. వైద్యులపై దాడులకు తెగబడటం లాంటివి అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

ఈ తీరుపై ఆసుపత్రులు.. వైద్యులు ఆందోళన చేస్తున్నారు. ఇలాంటివేళ.. ఈ తరహా దాడులకు పుల్ స్టాప్ పెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా వైద్యులపై చేయి ఎత్తటానికి సైతం వణికేలాంటి కఠినమైన చట్టాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తోంది మోడీ సర్కారు. ఇందులో భాగంగా ముసాయిదా బిల్లును సిద్ధం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి కానీ.. ప్రైవేటు ఆసుపత్రి కానీ.. వైద్యులు.. పారా మెడికల్ సిబ్బంది.. నర్సులు.. ఇలా ఆసుపత్రికి చెందిన ఏ ఉద్యోగి మీదనైనా సరే దాడులు జరిగితే.. దాడుల చేసిన వారికి చుక్కలు కనిపించేలా తీవ్రమైన శిక్షలు వేసే విధంగా తాజాగా తయారు చేసిన ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు.

దీని ప్రకారం ఆసుపత్రుల మీద దాడి చేసే వారు కఠినమైన శిక్షల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్న స్పష్టమైన సంకేతాల్ని ఇచ్చారని చెప్పాలి. ఆన్ లైన్లో ఉంచిన తాజా బిల్లు ప్రకారం.. ఒక డాక్టర్ లేదా నర్సు లేదంటే ఇతర వైద్య సిబ్బంది మీద భౌతిక దాడికి పాల్పడితే కనీసం ఆర్నెల్లు జైలు శిక్ష అని.. గాయపర్చినా.. హింసకు గురి చేసినా.. దాని తీవ్రత ఆధారంగా మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకూ జైలుశిక్షగా పేర్కొన్నారు. భౌతిక దాడికిపాల్పడే వారికి జైలుతో పాటు.. రూ.5వేలు మొదలు రూ.5లక్షల వరకూ జరిమానా విధించొచ్చని తేల్చారు.

ఇక.. కోలుకోలేని రీతిలో వైద్యుల్ని కానీ వైద్య సిబ్బంది మీద కానీ దాడికి పాల్పడితే.. అలా దాడి చేసిన వారికి పదేళ్లు జైలును విధించొచ్చు. కేసు తీవ్రతను అనుసరించి రూ.10లక్షల వరకూ ఫైన్ విధించొచ్చు. ఐపీసీతో సంబంధం లేకుండా చిన్న కాగితం మీద బాధితులు ఫిర్యాదు చేసినా.. కేసు నమోదు చేయాలి. సీఆర్ పీసీతో సంబంధం లేకుండా దాడులకు పాల్పడిన వారిని వెనువెంటనే అరెస్ట్ చేసే వీలుంది.

బెయిల్ కూడా ఇవ్వరని చెబుతున్నారు. ఆస్తినష్టానికి పాల్పడితే మార్కెట్ వాల్యూకు రెండు రెట్లు ఫైన్ గా చెల్లించటంతో పాటు.. కోర్టు నిర్దేశించిన ప్రకారం కట్టాల్సి ఉంటుంది. ఒకవేళ దాడులకు పాల్పడిన వారు పరిహారాన్ని చెల్లించకుంటే.. రెవెన్యూ చట్టం కింద వారి ఆస్తుల్ని స్వాధీనం చేసుకొని వసూలు చేసుకునే వీలుంది. వైద్య సిబ్బందిని మామూలుగా గాయపరిస్తే రూ.లక్ష.. తీవ్రంగా గాయపరిస్తే రూ.5 లక్షల వరకూ పరిహారం లభించేలా ముసాయిదా బిల్లును సిద్ధం చేశారు.

ఆన్ లైన్లో ఉంచిన ముసాయిదా బిల్లుకు ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ఆధారంగా కేంద్రం పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టనున్నట్లు చెబుతున్నారు. చూస్తుంటే.. వైద్యుల మీద చేయి ఎత్తాలన్న ఆలోచన వచ్చేందుకు సైతం వణుకు పుట్టేలా బిల్లును సిద్ధం చేసినట్లుగా చెప్పక తప్పదు.