Begin typing your search above and press return to search.

వివ‌క్ష‌కు ఆజ్యం: బీజేపీ ఎమ్మెల్యే షేమ్‌లెస్ కామెంట్లు

By:  Tupaki Desk   |   28 April 2020 12:30 PM GMT
వివ‌క్ష‌కు ఆజ్యం: బీజేపీ ఎమ్మెల్యే షేమ్‌లెస్ కామెంట్లు
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తిని కొంద‌రు రాజ‌కీయం చేసుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని మ‌తానికి కూడా ఆపాదిస్తున్న దౌర్భాగ్యం మ‌న‌దేశంలో ఉంది. క‌రోనా వైర‌స్ ఓ మ‌తం వారి వ‌ల‌న వ్యాపిస్తోంద‌ని.. అందుకే అలాంటి వ్య‌క్తుల నుంచి కూర‌గాయ‌లు కొన‌వ‌ద్ద‌ని ఓ ఎమ్మెల్యే పిలుపునివ్వ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. ఒక ప్ర‌జాప్ర‌తినిధి అయి ఉండి అలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డంతో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ బీజేపీ ఎమ్మెల్యే మ‌రోసారి తన నోటి దురుసును ప్రదర్శించుకున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని డియోరియ జిల్లా బ‌ర్హాజ్ బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారీ గ‌తంలో ఎన్నో సార్లు తీవ్ర దుమారం రేపేలా వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా క‌రోనా వైర‌స్ వ్యాప్తి నేప‌థ్యంలో కూడా మ‌రోసారి తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్న వీడియోను విడుద‌ల చేశారు. ఈ మేర‌కు ఆ వీడియో సోష‌ల్ మీడియోలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఆయ‌న మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా వినండి, ఎవరూ కూడా ఓ మ‌తానికి చెందిన దుకాణంలో కూరగాయాలు కొనొద్దు. ఎందుకంటే వారినుంచి వైరస్ వ్యాపిస్తోంది అని తెలిపారు. కొంద‌రు చేసిన తప్పును ఒక మతాన్ని నిందించడం సరికాదు అని ఆర్ఎస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తెలిపిన కొద్దిరోజుల‌కే బీజేపీ ఎమ్మెల్యే ఈ విధంగా వ్యాఖ్యా‌నించారు.

అత‌డు చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. విప‌త్క‌ర స‌మ‌యంలో మాన‌వ‌త్వం ప్ర‌ద‌ర్శించాల్సింది పోయి మ‌త రాజ‌కీయాలు చేయ‌డం స‌రికాద‌ని హిత‌వు ప‌లుకుతున్నారు. బీజేపీ నేతలు సమాజంపై తమ‌ ద్వేష భావాన్ని వ్యాపింపజేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎమ్మెల్యేపై దేశద్రోహం కేసు నమోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

ఇలాంటి ప‌రిణామం ఇప్పుడే కాదు గ‌తంలోనూ జ‌రిగాయి. ఢిల్లీలో కూరగాయాలు విక్రయించే వ్య‌క్తి పేరు అడిగి మ‌రి దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక జంషెడ్ పూర్‌లో పండ్ల దుకాణంపై విశ్వహిందూ పరిషత్ ఓ పోస్ట‌ర్ వేసి విద్వేషాన్ని ర‌గిల్చేలా చ‌ర్య‌కు పాల్ప‌డ్డారు. మీరట్ ఆస్పత్రిలో కూడా వివ‌క్ష చూపేలా చ‌ర్య‌ జ‌రిగింది. ఆప‌త్కాలంలో కులం, మ‌తం, జాతి వంటి ప్ర‌స్తావ‌న ఎందుకు.. మాన‌వ‌త్వంతో అంద‌రినీ ఆద‌రిద్దామ‌ని ప‌లువురు పిలుపునిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్య‌లు షేమ్‌లెస్ కామెంట్లు అని తీవ్రంగా మండిప‌డుతున్నారు.