Begin typing your search above and press return to search.

కరోనాతో యూపీ మంత్రి మృతి.. 5 మంది ఎమ్మెల్యేల మృత్యువాత !

By:  Tupaki Desk   |   19 May 2021 11:00 AM IST
కరోనాతో యూపీ మంత్రి మృతి.. 5 మంది ఎమ్మెల్యేల మృత్యువాత !
X
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ కొనసాగుతోంది. దేశంలో లక్షల్లో పాజిటివ్ కేసులు , మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వైరస్ దెబ్బకి సామాన్యులతో పాటుగా , రాజకీయ నేతలు, ప్రముఖులు కరోనా కాటుకి బలైపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ రెవెన్యూ, వరద నియంత్రణ మంత్రి విజయ్ కశ్యప్ కరోనా తో కన్నుమూశారు. 56 ఏళ్ల మంత్రి ముజఫర్‌ నగర్‌ లోని చార్తవాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహమ్మారి బారినపడి గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరిన ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కరోనా సెకండ్ వేవ్‌లో యూపీలో ఇప్పటికే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు చనిపోగా.. ఈయనతో ఆ సంఖ్య ఐదుకి చేరింది.

గతేడాది మంత్రులు కమల్ రాణి వరుణ్, చేతన్ చౌహాన్ కరోనాతో మృతి చెందారు. విజయ్ మృతికి ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ సంతాపం తెలిపారు. కాగా, కరోనా సెకండ్ వేవ్ ప్రభావానికి మరణించిన బీజేపీ ఎమ్మెల్యేలలో విజయ్ కశ్యప్ ఐదోవారు. అంతకుముందు సలోన్ శాసనసభ్యుడు దాల్ బహదూర్ కోరి, నవాబ్‌‌ గంజ్ శాసనసభ్యుడు కేసర్ సింగ్ గంగ్వార్, ఔరైయా ఎమ్మెల్యే రమేశ్ దివాకర్, లక్నో వెస్ట్ ఎమ్మెల్యే సురేశ్ కుమార్ శ్రీవాస్తవ కరోనాకు బలయ్యారు. శ్రీవాస్తవ భార్య కూడా కరోనా కారణంగా మృతి చెందారు. మంత్రి మృతిప‌ట్ల ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా సంతాపం తెలిపారు. మంచి కార్య‌క‌ర్త‌ను పార్టీ కోల్ప‌యింద‌ని చెప్పారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ లో మొత్తం 403 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, అందులో 307 బీజేపీ, 49 స‌మాజ్‌వాదీపార్టీ, 18 బీఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.