Begin typing your search above and press return to search.

కరోనాని కూడా వదలని దొంగ బాబాలు..ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   17 March 2020 8:00 AM IST
కరోనాని కూడా వదలని దొంగ బాబాలు..ఏంచేశారంటే ?
X
కరోనా వైరస్ చైనాలో ప్రారంభమై ... ప్రపంచ వ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. చైనా వెలుపల అత్యధికంగా ఇటలీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతర్జాతీయంగా అనేక దేశాల్లో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో దీనిని ప్రపంచ మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అయితే, వైద్యరంగం పరంగా ప్రపంచం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ .. ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ కి ఇంకా మందు కనిపెట్టలేదు. ఇప్పటివరకు ఈ వైరస్ దాదాపుగా ప్రపంచంలోని 140 దేశాలకి విస్తరించింది. అలాగే ఈ వ్యాధి బారిన పడి సుమారు 6000 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇకపోతే ఈ కరోనా వైరస్ భయం ప్రజలలో రోజురోజుకి పెరిగిపోతుంది. దీనితో కరోనా నుండి తప్పించుకోవడానికి ఎవరేం చెప్పినా కూడా వాటిని పాటిస్తున్నారు. హోమియో మందులు, ఆయుర్వేద వైద్యం, వంటింటి చిట్కాలు.. ఇలా ఎవరు చెప్పినా కూడా ఒకసారి ట్రై చేస్తే పోయేదేముంది అని ట్రై చేస్తున్నారు. అయితే , ఈ కరోనా పేరు చెప్పి కొంతమంది అమాయకమైన ప్రజల నుండి అందిన కాడికి డబ్బులు కాజేస్తున్నారు.

తాజాగా ఉత్తర ప్రదేశ్‌లో ఓ దొంగ బాబా ఏకంగా కరోనా వైరస్ రాకుండా చేస్తానంటూ తాయెత్తులు కట్టడం ప్రారంభించాడు. ఈ తాయత్తు వేసుకునే కరోనా మీకు సోకదు అని ప్రచారం చేయడంతో ..విరివిగా వచ్చి , ఆ దొంగబాబా వద్ద తాయెత్తులు వేపించుకుంటున్నారు. అయితే , ఆ దొంగబాబా గురించి తెలుసుకున్న పోలీసులు అయన ఆట కట్టించి జైలుకు పంపించారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో జరిగిందీ ఘటన.

చేతికి తాను కట్టే ఒకే ఒక్క తాయెత్తు కరోనా రాకుండా చేస్తా అని, నగరానికి చెందిన అహ్మద్ సిద్ధిఖీ ఏకంగా బోర్డు పెట్టి మరీ తాయెత్తులు విక్రయిస్తున్నాడు. అమాయక ప్రజలు నిజమేనని నమ్మి చేతికి తాయెత్తులు కట్టించుకుంటున్నారు. రూ. 11కి ఒక తాయెత్తు కడుతుండడంతో ఇది మాస్కు కంటే చవగ్గా ఉందంటూ సిద్దిఖీ వద్దకు జనం బారులు తీరారు. దీని పై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఎంటరై సిద్దికీని అరెస్టు చేసి రిమాండుకు పంపించారు. ఇప్పటివరకు ఉత్తరప్రదేశ్‌ లో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆ రాష్ట్రంలో ప్రజలు భయపడుతున్నారు. ఆ భయాన్ని ఇలా కొంతమంది దొంగబాబాలు క్యాష్ చేసుకుంటున్నారు.