Begin typing your search above and press return to search.

సచిన్ కొడుకు రచ్చ ఏంది బాస్

By:  Tupaki Desk   |   2 Jun 2016 8:23 AM GMT
సచిన్ కొడుకు రచ్చ ఏంది బాస్
X
స్టార్ కొడుక్కి.. ఒక సగటుజీవి కొడుక్కి మధ్య అంతరం చాలా ఎక్కువే ఉంటుంది. స్టార్ కొడుక్కి కాసింత ప్రతిభ ఉంటే సరిపోతుంది. సామాన్యుడి కొడుక్కి అంతకు మించి చాలానే ఉండాలి. మామూలు రంగాల్లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే.. క్రికెట్ లాంటి హై కాంపిటీషన్ ఉన్న రంగాల్లో పరిస్థితి మరెంత తీవ్రంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఇదంతా ఒక ఎత్తు అయితే భారతరత్న పురస్కార గ్రహీత.. క్రికెట్ దేవుడిగా అందరి మన్ననలు పొందిన సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కు అవకాశాలు ఎంతలా వచ్చి పడతాయో చాటి చెప్పే ఉదంతం ఇది. అండర్ 16 ఇంటర్ జోనల్ టోర్నమెంట్ లో పాల్గొనే వెస్ట్ జోన్ జట్టులో సచిన్ కొడుకు అర్జున్ ను ఎంపిక చేయటం ఇప్పుడు పెద్ద దుమారమే నడుస్తుంది. దీనికి సముచిత కారణం లేకపోలేదు. ఈ జట్టులో సచిన్ కొడుకు ఎంపికయ్యాడు కానీ.. ఒక మ్యాచ్ లో సింగిల్ హ్యాండ్ తో 1009 పరుగులు చేసిన సామాన్య ఆటో డ్రైవర్ కొడుకైన ప్రణవ్ ధన్వాడేకు చోటు దక్కకపోవటం ఇప్పుడు వివాదంగా మారింది.

అన్నేసి పరుగులు చేసిన ప్రణవ్ కు జట్టులో స్థానం కల్పించకుండా.. అరకొర ప్రతిభను ప్రదర్శించే సచిన్ కొడుక్కి జట్టులో స్థానం కల్పిస్తారా? అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

సచిన్ కొడుకు అర్జున్.. ప్రణవ్ కు మధ్య పోలికల్ని చూపిస్తూ సోషల్ మీడియాలో భారీగానే ప్రచారం సాగుతోంది. ఈ వ్యవహారం ఇలా ఉంటే ఈ వ్యవహారంపై.. ప్రణవ్ తండ్రి ఆటో డ్రైవర్ అయిన ప్రశాంత్ స్పందించారు. జట్టులో స్థానం లభించలేదంటూ చేస్తున్న వాదన అర్థరహితమని చెబుతున్నాడు. అర్జున్ టెండూల్కర్ కారణంగా తన కొడుక్కి అన్యాయం జరగలేదని.. వాస్తవానికి వారిద్దరూ మంచి స్నేహితులని చెప్పాడు. అర్జున్ ను జట్టుకు ఎంపిక చేసే సమయానికి ప్రణవ్ 1009 పరుగులు చేయలేదని వివరిస్తున్నాడు. సోషల్ మీడియాతో పాటు.. మీడియాలోనూ ఇద్దరిని పోలిక పెడుతూ వార్తలు రావటం వల్ల ఇద్దరి మీద ఒత్తిడి పెరుగుతుందని.. ఇది ప్రణవ్ కు మంచి జరగదన్న మాట వినిపిస్తోంది. ఒకట్రెండు ఉదంతాలకే అర్జున్ టెండూల్కర్ మీద విరుచుకుపడే కన్నా.. కాస్త వెయిట్ చేస్తే బాగుంటుందేమో..? సోషల్ మీడియాలో నాలుగు కామెంట్లు చేసే వాడిదేముంది? కామెంట్లు చేస్తాడు.. తన దారిన తాను పోతాడు. కానీ.. వాటి ప్రభావాన్ని మోయాల్సింది బక్కపల్చటి ప్రణవ్ ధన్వాడేనే కదా?