Begin typing your search above and press return to search.

ఉన్నావ్ : ఇద్దరు బాలికలు మృతి ..పోస్ట్ మార్టంతో వెలుగులోకి అసలు ట్విస్ట్ - అంత్యక్రియలు పూర్తి !

By:  Tupaki Desk   |   19 Feb 2021 6:00 PM IST
ఉన్నావ్  : ఇద్దరు బాలికలు మృతి ..పోస్ట్ మార్టంతో వెలుగులోకి అసలు ట్విస్ట్ - అంత్యక్రియలు పూర్తి !
X
ఉత్తరప్రదేశ్‌ లోని ఉన్నావ్‌ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. గత ఏడాది ఉన్నావ్ లో జరిగిన ఘటన వేడి ఇంకా పూర్తిగా చల్లారకముందే మరోసారి నిర్ఘాంతపోయే సంఘటన చోటుచేసుకుంది. పశుగ్రాసం కోసం బాబుహరా గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతానికి వెళ్లిన 15 ఏళ్లు, 14 ఏళ్లు, 16 ఏళ్ల వయసున్న ముగ్గురు బాలికల్లో ఇద్దరు అనుమానాస్పదంగా మరణించిన సంఘటన సంచలనం రేకెత్తించింది.

బుధవారం అడవికి వెళ్లిన బాలికలు చీకటి పడినా ఇళ్లకు రాకపోయేసరికి కుటుంబసభ్యులు వారి కోసం వెతుకుతుండగా దట్టమైన పొదల్లో ముగ్గురూ అపస్మారక స్థితిలో వారు కనిపించారు. వెంటనే స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే ఇద్దరు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. మరో బాలిక పరిస్థితి విషమంగా ఉండడంతో కాన్పుర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ముగ్గురి పై విష ప్రయోగం జరిగిందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ కిరాతక ఘటన ఉన్నావ్ తోపాటు ఉత్తరప్రదేశ్ అంతటా కలకలం రేపింది. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, చనిపోయిన ఇద్దరి మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఆ ఇద్దరు బాలికల శరీరంపై ఎలాంటి గాయాల గుర్తులు లేకపోవడంతో ఎందుకు చనిపోయారు అనేది కనిపెట్టడం కష్టతరమైంది.

కాగా, పోస్టుమార్టం నివేదికలో కీలక అంశాలు బయటపడినట్లు అధికారులు చెబుతున్నారు. విషంప్రయోగం వల్లే బాలికలు చనిపోయి ఉంటారని వైద్యులు అనుమానిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. కాన్పూర్‌ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతోన్న బాలికను కూడా విషప్రయోగం కేసుగానే డాక్టర్లు చెబుతున్నారని అన్నారు.

ఉన్నావ్ జిల్లా, అసోహా పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు దళిత బాలికపై కిరాతకం, అందులో ఇద్దరి మరణం ఘటనపై ఉత్తరప్రదేశ్ తోపాటు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో యోగి సర్కారు ఈ కేసు దర్యాప్తు కోసం మొత్తం ఆరు బృందాలను రంగంలోకి దించి విచారణ చేయిస్తుంది.

ఇదిలా ఉంటే గుర్తుతెలియని వ్యక్తుల చేతిల్లో హత్యకు గురైన ఇద్దరు బాలికల అంత్యక్రియలు శుక్రవారం ముగిశాయి. అసోహా పోలీస్ స్టేషన్ పరిధిలోని వారి స్వగ్రామమైన బబుహారాలో కుటుంబీకుల సమక్షంలో పోలీసులే దగ్గరుండిమరీ అంత్యక్రియలు చేయించారు. అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు.