Begin typing your search above and press return to search.

అన్‌లాక్‌-5.0 స‌డ‌లింపులు ఇవే.. దాదాపు అన్నింటికీ ప‌చ్చ‌జెండా!

By:  Tupaki Desk   |   5 Oct 2020 6:00 PM IST
అన్‌లాక్‌-5.0 స‌డ‌లింపులు ఇవే.. దాదాపు అన్నింటికీ ప‌చ్చ‌జెండా!
X
క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టే విష‌యంలో కీల‌కంగా అమ‌లు చేసిన‌ లాక్‌డౌన్‌ను కేంద్ర ప్ర‌భుత్వం విడ‌త‌ల వారీగా స‌డ‌లిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే నాలుగు సార్లు ఈ లాక్‌డౌన్‌ను స‌డ‌లించి.. మూత‌బ‌డిన ఆర్థిక రంగాన్ని మ‌ళ్లీ గాడిన పెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. ఈ నెల 15 నుంచి అన్‌లాక్ 5.0 ను అమ‌లు చేసేలా కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు రూపొందించింది. దీనిలో దాదాపు అన్నింటికీ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. మ‌రీ ముఖ్యంగా సినిమా హాళ్లు తెరిచేందుకు ఈ అన్‌లాక్ 5.0లో మార్గం సుగ‌మం చేశారు. అయితే, కొన్ని నిర్దేశిత నియమాల‌కు లోబ‌డి మాత్ర‌మే వీటిని తెర‌వాల్సి ఉంటుంది.

ఇక‌, అన్‌లాక్ 5.0కు సంబంధించి కేంద్రం ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాలు ఏంటంటే.. కట్టడి ప్రాంతాల వెలుపల అన్ని సినిమా హాళ్లను అక్టోబరు 15 నుంచి తెరుచుకోవచ్చు. అయితే హాళ్లలో ప్రేక్షకుల సంఖ్య సగానికి సగం తగ్గించాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. స్కూళ్లు, కాలేజీలను కూడా 15 నుంచి తెరవవచ్చు. అయితే, ఈ విష‌యంలో పూర్తి నిర్ణ‌యం రాష్ట్ర ప్ర‌భుత్వాల‌దేన‌ని కేంద్రం స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా బిజినెస్‌ టు బిజినెస్‌ (బీటూబీ) ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేసుకునే అవ‌కాశం ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్‌ను తెరిచేందుకు అవ‌కాశం ఉంటుంది. పార్కులు ఓపెన్ అవుతాయి.

ఇప్ప‌టి వ‌ర‌కు మూత‌బ‌డిన పాఠ‌శాల‌ల‌తోపాటు కోచింగ్ సెంట‌ర్ల‌ను కూడా ఈ నెల 15 నుంచి ప్రారంభించేందుకు అవ‌కాశం ఉంటుంది. డిస్టెన్స్ ఎడ్యుకేష‌న్ ప్రారంభించుకోవ‌చ్చు. కాలేజీలు, ఉన్నతవిద్యాసంస్థలను తెర‌వ‌వ‌చ్చు. బహిరంగ ప్రదేశాల్లో సభలు, సమావేశాలు నిర్వ‌హించుకోవ‌చ్చు. అయితే, సామాజిక దూరం తప్పనిసరి. మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్‌ నిబంధనలు పాటించాలి. ఇలా దాదాపు అన్నింటికీ కేంద్రం అన్‌లాక్ 5.0లో స‌డ‌లింపులు ఇచ్చింది. అయితే, కంటైన్‌మెంట్‌ జోన్లలో మాత్రం అక్టోబరు 31 దాకా అన్‌లాక్ నిబంధ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎవ‌రికి వారే.. క‌రోనా విష‌యంలో స్వీయ జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.