Begin typing your search above and press return to search.

కోవిడ్ మరణాలపై కొత్త విషయాన్ని బయటపెట్టిన మిచిగాన్ వర్సిటీ

By:  Tupaki Desk   |   3 Oct 2020 7:00 AM IST
కోవిడ్ మరణాలపై కొత్త విషయాన్ని బయటపెట్టిన మిచిగాన్ వర్సిటీ
X
మాయదారి మహమ్మారికి మిస్టరీగా మారటమే కాదు.. ఎంతకూ అంతుచిక్కని కోవిడ్ 19కు సంబంధించిన కొత్త విషయాల్ని వెల్లడించింది అమెరికాకు చెందిన మిచ్ గాన్ వర్సిటీ. కరోనా పాజిటివ్ గా మారి.. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో తీవ్ర అనారోగ్య సమస్యలే కాదు.. గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని తాజాగా చేసిన పరిశోధనలో తేల్చారు. 80 ఏళ్లకు పైబడిన వారిలో కోవిడ్ 19 పాజిటివ్ అయితే.. అలాంటివారికి గుండెపోటు సహజమేనని చెబుతున్నారు. తాము చేసిన పరిశోధన వివరాల్ని తాజాగా వెల్లడించారు.

తమ పరిశోధనలో భాగంగా 68 ఆసుపత్రుల్లో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న 18 ఏళ్లు దాటిన 5019 మంది కోవిడ్ పేషెంట్లను పరిశీలించారు. వీరిలో 14 శాతం మంది ఆసుపత్రిలో చేరిన పద్నాలుగు రోజుల్లోనే గుండెపోటుకు గురైనట్లుగా తేల్చారు. 57 శాతం మందిని మాత్రం సీపీఆర్ అందించటం ద్వారా సేవ్ చేసినట్లుగా గుర్తించారు.

ఆసుపత్రిలో చేరిన 80 ఏళ్లకు పైబడిన వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉందని గుర్తించారు. వారిలో.. ప్రాణాలు కోల్పోతున్న వారు ఎక్కువన్న వైనం బయటకు వచ్చింది. పెద్ద వయస్కులతో పోలిస్తే.. తక్కువ వయస్కులే ఎక్కువ మంది ప్రాణాలతో బయటపడుతున్నట్లుగా గుర్తించారు.

కోవిడ్ 19 తీవ్ర లక్షణాలు ఉన్న వారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురి కావటం ఈ మధ్యన చూస్తున్నదే. రక్తం గడ్డ కట్టటంతో ఇలాంటి పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది. ఈ విషయాన్ని సదరు అధ్యయనంలో ప్రస్తావించలేదు. కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉన్న వారిలో కార్డిక్ సమస్యలతో ప్రాణాపాయం ఎదురవుతున్న వైనాన్ని గుర్తించారు.