Begin typing your search above and press return to search.

ప్రపంచానికి కరోనా చేసిన చేటు.. ఐక్యరాజ్యసమితి తాజా వార్నింగ్

By:  Tupaki Desk   |   7 Dec 2020 1:00 PM IST
ప్రపంచానికి కరోనా చేసిన చేటు.. ఐక్యరాజ్యసమితి తాజా వార్నింగ్
X
ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనా.. ఎంతటి నష్టానికి గురి చేసిందో అంచనా వేయలేనంత భారీగా మారింది. ఇప్పటికే బయటకు వచ్చినవే కాదు.. బయటకురాని అంశాలెన్నో ఉన్నట్లు చెబుతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రాణాలు విడవగా..కోట్లాది మందికి ఈ పాడు వైరస్ సోకి తెగ ఇబ్బందులు పడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆర్థికంగా జరిగిన నష్టం అంతా ఇంతా కాదు. కరోనా కారణంగా సంపన్న దేశాలు సైతం ఉక్కిరిబిక్కిరి కావటంతో పాటు.. కొత్త సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. మరో నెల వ్యవధిలో వ్యాక్సిన్ వచ్చేస్తుందన్న రిలీఫ్ వేళ.. వణికించే వాస్తవాలు బయటకు వస్తున్నాయి.

తాజాగా అలాంటి వాస్తవాన్నే వెల్లడించింది ఐక్యరాజ్యసమితి. కరోనా కారణంగా రానున్న రోజుల్లో 20 కోట్ల మంది తీవ్ర పేదరికంలో జారుకోనున్నట్లు ఐక్యరాజ్యసమితి అంచనా వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పేదరికంలో ఉన్న వారిలో కలిసి 2030 నాటికి దాదాపు 100 కోట్ల మంది వరకు కటిక పేదరికాన్ని అనుభవించే దారుణ పరిస్థితులు నెలకొన్నట్లుగా చెబుతుున్నారు.

కరోనా కారణంగా రానున్న పదేళ్లలో ప్రపంచం ఎదుర్కొనే పరిస్థితులు.. పరిణామాలపై ఐక్యరాజ్యసమితిలోని ఒక విభాగం పరిశోధనలు జరిపింది. రానున్న పదేళ్లలో డెవలప్ మెంట్ మీద ఇది చూపే ప్రభావం ఎంతన్న అంశాన్ని పరిశీలించింది. దీని ప్రకారం.. కరోనాకు ముందు ఉన్న అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి 4 కోట్ల మంది వరకు ప్రజలు తీవ్రమైన పేదరికంలో బతుకుతారని ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్యనిధి) నివేదికలు స్పష్టం చేశాయి.

కరోనా దెబ్బకు ఆ అంచనాలు మారిపోయాయి. కరోనా నుంచి కోలుకోవటానికి ఎక్కువ కాలం పడితే పదేళ్ల తర్వాత 20 కోట్ల మంది తీవ్రమైన పేదరికంలోకి జారే అవకాశం ఉందంటున్నారు. కరోనా కారణంగా పదేళ్ల పాటు ఆర్థిక సంక్షోభం ఉంటుందన్న అంచనా వ్యక్తమవుతోంది. కరోనా నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా వెనుకటి పరిస్థితుల్లోకి వెళ్లేలా ప్రభుత్వాలు ప్రయత్నించాలని చెబుతున్నారు.

కరోనాతో తీవ్రమైన సంక్షోభం చోటు చేసుకున్నా.. సుస్థిరమైన డెవలప్ మెంట్ ను సాధించేందుకు కొత్త విధానంలో ముందుకు వెళ్లే అవకాశాన్ని కల్పించిందని చెబుతున్నారు. ఏమైనా.. కరోనా ప్రపంచవ్యాప్తంగా పేదరికాన్ని ఎంతలా పెంచిందన్న విషయం తాజా పరిశోధన స్పష్టం చేసిందని చెప్పక తప్పదు.