Begin typing your search above and press return to search.

హెచ్ సీయూ గొడవలో మంత్రులకు క్లీన్ చిట్

By:  Tupaki Desk   |   20 Feb 2016 12:02 PM IST
హెచ్ సీయూ గొడవలో మంత్రులకు క్లీన్ చిట్
X
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్ వీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య కు దారితీసిన కారణాల్లో ఒకటిగా చెబుతున్న విద్యార్థుల సస్పెన్షన్‌ విషయంలో కేంద్ర మంత్రుల జోక్యం ఏమీ లేదని తేలింది. కేంద్రం నియమించిన నిజ నిర్ధారణ కమిటీ ఈ మేరకు తేల్చిచెప్పింది. పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్యకు, వర్సిటీలో గొడవలకు యూనివర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇచ్చింది. మానవ వనరుల శాఖ నుంచి వచ్చిన లేఖలను హెచ్‌సీయూ అధికారులు అసలు పట్టించుకోలేదని.... అసలు వారు కేంద్రం నుంచి వచ్చిన లేఖలను పట్టించుకోనప్పుడు వారిపై మంత్రుల ఒత్తిడి ఉందనడం అర్ధరహితమని నివేదికలో అభిప్రాయపడినట్లు సమాచారం.

కాగా హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య అంశం వివాదం కావడంతో కేంద్రం దీనిపై ద్విసభ్య కమిటీని వేసింది. వారు వర్సిటీలో పరిస్థితులను పరిశీలించింది. అధికారులు, విద్యార్థులతో మాట్లాడి తాజాగా మానవ వనరుల శాఖకు నివేదిక అందజేశారు. హెచ్‌సీయూలో విద్యార్థుల సస్పెన్షన్, వివాదాలు, రోహిత్ ఆత్మహత్య తదితర ఘటనలకు వర్సిటీ యాజమాన్యం వైఫల్యమే కారణమని నివేదికలో పేర్కొన్నట్లు తెలిసింది. రోహిత్‌తో పాటు ప్రశాంత్ - విజయ్ - సుంకన్న - శేషులపై సస్పెన్షన్ వేటుకు కేంద్ర మంత్రుల జోక్యం కారణం కాదని స్పష్టం చేసినట్లు సమాచారం.

కాగా సస్పెన్షన్ల అనంతరం ఆందోళన చేస్తున్న విద్యార్థులతో వర్సిటీ యాజమాన్యం చర్చలు జరపకపోవడాన్ని కమిటీ తప్పు పట్టింది. వర్సిటీ మెడికల్ ఆఫీసర్ ఇచ్చిన రిపోర్టులోనూ, 2015 ఆగస్టు 3, 4 తేదీల్లో వర్సిటీ ప్రాక్టోరియల్ బోర్డు చేపట్టిన విచారణ కూడా సవ్యంగా లేదని తేల్చింది. సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరించే విధానం వర్సిటీలో లేదని... ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థులు తాము వివక్షకు గురవుతున్నట్లు భావిస్తున్నారని.. అలాంటివన్నీ గుర్తించి పరిష్కరించే చర్యలు అక్కడ లేకపోవడంతో ఈ పరిస్థితిఏర్పడిందని కమిటీ తేల్చింది. అంతేకాకుండా... గతంలో హెచ్‌ సీయూలో జరుగుతున్న కొన్ని విషయాల్లో స్పందించి, చర్యలు తీసుకోవాలంటూ 2014 నవంబర్‌ లో పార్లమెంటు సభ్యులు లేఖ రాసిన విషయాన్ని కూడా నిజ నిర్ధారణ కమిటీ తన నివేదికలో ప్రస్తావించింది. వర్సిటీలో జరిగిన కొన్ని ఘటనల నేపథ్యంలో 2008లో నియమించిన వినోద్ పావురాల కమిటీ సూచనలనుగానీ, ప్రొఫెసర్ కృష్ణ కమిటీ సూచనలనుగానీ, 2014లో నియమించిన జస్టిస్ రామస్వామి కమిటీ నివేదికనుగానీ వర్సిటీ యాజ మాన్యం పట్టించుకోలేదని... ఆ సూచనలు అమలు చేయలేదని కమిటీ స్పష్టం చేసింది.