Begin typing your search above and press return to search.

ఎండలో నిలబడితే కరోనా చచ్చిపోతుంది అంటున్న కేంద్రమంత్రి !

By:  Tupaki Desk   |   19 March 2020 9:30 AM GMT
ఎండలో నిలబడితే కరోనా చచ్చిపోతుంది అంటున్న కేంద్రమంత్రి !
X
భారత్‌ లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. బుధవారం నాటికి 158గా ఉన్న కరోనా కేసులు గురువారం ఉదయం 10 గంటల సమయానికి ఆ సంఖ్య 168కి చేరింది. ఈ మేరకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే భారత్ లో ఇప్పటి వరకు 13,316 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు వైద్యులు తెలిపారు. కాగా , కొత్తగా కర్ణాటక, మహారాష్ట్రలో రెండేసి చొప్పున కొత్త కేసులు వెలుగుచూశాయి. దేశంలో ఎక్కువగా మహారాష్ట్రలో 42 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 13 పాజిటివ్‌ కరోనా కేసులు నమోదయ్యాయి,

ప్రస్తుతం కరోనా భయంతో దేశ ప్రజలందరూ భయంతో వణికిపోతుంటే ... కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్విని చౌబే ప్రజలకు ఒక సలహా ఇచ్చారు. గోమూత్రంతో క్యాన్సర్‌ కు చికిత్స అందించవచ్చని గతంలో వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి తాజాగా కరోనా వైరస్‌ను అధిగమించేందుకు 15 నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలని, అలా ఎండలో కూర్చుంటే సూర్యరశ్మితో కరోనా వైరస్ చచ్చిపోతుంది అని చెప్పుకొచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల మధ్య భానుడి ప్రతాపం తీవ్రంగా ఉంటుందని, ఈ సమయంలో ఎండలో కూర్చుంటే మన శరీరంలో విటమిన్‌ డీ నిల్వలు పెరుగుతాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఈ విటమిన్‌ లేదా సూర్యరశ్మి ద్వారా కరోనా వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చనేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కొందరు వైద్య నిపుణులు కూడా ఎండకి కరోనా చచ్చిపోతుంది అని ఖచ్చితంగా చెప్పలేము అని ఇప్పటికే చెప్పినా కూడా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, అందులోనూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే అశాస్త్రీయమైన ఇలాంటి చిట్కాలను పాటించవద్దు అని , చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, సామాజిక దూరం పాటించడం, దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు నోటికి మోచేయి అడ్డుపెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.