Begin typing your search above and press return to search.

టీడీపీని వ‌దిలేశాం..ఎన్డీఏలోకి వ‌చ్చేసేయ్ జ‌గ‌న్‌

By:  Tupaki Desk   |   26 April 2018 12:01 PM GMT
టీడీపీని వ‌దిలేశాం..ఎన్డీఏలోకి వ‌చ్చేసేయ్ జ‌గ‌న్‌
X
కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి రాందాస్ అథవాలే సంచలన కామెంట్లు చేశారు. రాష్ట్ర ప‌ర్య‌ట‌న‌లో ఉన్న అథ‌వాలే ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీని ఎన్డీఏలోకి ఆహ్వానిస్తున్నామ‌న్నారు. ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడం తొందరపాటు చర్యగా కేంద్రమంత్రి పేర్కొంటూ టీడీపీ కాకపోతే వైసీపీ అయినా ఎన్డీఏలో చేరాలన్నారు. రాష్ట్ర అధికారులతో రాందాస్‌ అథవాలే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో రైల్వే - టెలికాం రంగాలకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు.. ఎస్సీ, ఎస్టీలకు దక్కుతున్న ఫలాలు, సమస్యలపై చర్చించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు సరికాదని, దీనిపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని కేంద్రం ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. చట్టసభల్లో చేసిన చట్టాలపై సుప్రీంకోర్టు జోక్యం మంచిది కాదన్నారు. ఆర్థికంగా వెనుకబడినవారికి రిజర్వేషన్లు ఇవ్వాలని రాందాస్‌ అథవాలే తెలిపారు.

ఏపీకి మరిన్ని నిధులిచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర‌మంత్రి అథ‌వాలే తెలిపారు. విద్యుత్‌, ఇరిగేషన్‌, రోడ్లకు సంబంధించి రూ.లక్ష కోట్లు కేటాయించామని రాందాస్‌ అథవాలే చెప్పారు. ఏపీకి ఇంత చేసిన స‌మ‌యంలో ఎన్డీఏ నుండి బయటకు రావడం టీడీపీ తొందరపాటు నిర్ణయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం తెలుగుదేశం మళ్ళీ తమతో కలవాలని ఆకాంక్షించారు. జగన్ పార్టీ అయినా ఎన్డీఏలోకి రావాలని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 2019లో తిరిగి కచ్చితంగా నరేంద్ర మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని తెలిపారు. ఇలాంటి సమయంలో వైసీపీ ఎన్డీయేలో కలవడం బాగుంటుందని, ఇది తన సూచన అని అన్నారు.ఏపీలో కాపు రిజర్వేషన్లకు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఇతర రాష్ట్రాలు అడుగుతాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టానికి మరిన్ని నిధులు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని అథవాలే తెలిపారు. కాగా, రాందాస్ అథ‌వాలే ఇలాంటి కామెంట్లు చేయ‌డం ఇదే మొద‌టిసారి కాద‌ని ప‌లువురు గుర్తు చేస్తున్నారు. వైసీపీ చీఫ్‌ పై ఆయన చేసిన కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. వైఎస్‌ జగన్‌ పై కేసులు న‌మోదైన సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్‌ తో విభేదాల కారణంగానే కేసులు న‌మోదు అయ్యాయ‌ని రాందాస్ అథవాలే వ్యాఖ్యానించారు.