Begin typing your search above and press return to search.

మొటిక్కాయ్ : సొమ్ములు మీరు పెట్టుకుంటే.. ఓకే!

By:  Tupaki Desk   |   26 Oct 2017 4:18 AM GMT
మొటిక్కాయ్ : సొమ్ములు  మీరు పెట్టుకుంటే.. ఓకే!
X
పోలవరం ప్రాజెక్టును ప్రతివారం నేను సమీక్షించేస్తున్నాను.. మరో ఏడాదిలోగా పూర్తిచేసి నీళ్లు ఇచ్చేస్తాను అంటూ అనేక రకాల బుకాయింపు మాటలు చెప్పడం వల్ల చంద్రబాబునాయుడు ఇన్నాళ్లుగా సాధించిచనదెల్లా.. ఏమీ లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా పనులు మామూలు వేగంతో జరగడానికి కూడా అవకాశం లేకుండా చంద్రబాబు అయోమయాన్ని సృష్టించారనే భావన ప్రజల్లో కలుగుతోంది. కాంట్రాక్టరును మార్చేస్తున్నాం అంటూ రెండు నెలలుగా ఊదరగొట్టడం వలన ప్రస్తుత కాంట్రాక్టరు జాగు చేస్తుండగా - కొత్త టెండర్లు పిలవడానికి కేంద్రం నో చెప్పడం తాజా దెబ్బగా ఉంది. కొత్త టెండర్లు పిలిస్తే భారీగా అంచనా వ్యయం పెరిగే నేపథ్యంలో.. చంద్రబాబు ప్రతిపాదనను కేంద్రం నిర్దాక్షిణ్యంగా తోసిపుచ్చడం విశేషం.

కొత్త టెండర్ల భారాన్ని మోయడానికి కేంద్రం సిద్ధంగా లేదని మంత్రి నితిన్ గడ్కరీ పదేపదే చెబుతున్నప్పటికీ... ఆయనను కన్విన్స్ చేయడానికి రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రయత్నించినప్పుడు.. దీనివలన అంచనా కంటె అదనంగా 25 శాతం భారం పడుతుంది. ఆ భారాన్ని మీరు (రాష్ట్ర ప్రభుత్వం) భరించేట్లయితే మాకు అభ్యంతరం లేదు అంటూ గడ్కరీ కటువుగానే సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. అక్కడితో దేవినేని ఉమా కూడా మళ్లీ మాట రెట్టించకుండా మౌనం పాటించే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఏ రకంగా చూసినా.. కేంద్రం ఆధ్వర్యంలో నితిన్ గడ్కరీ నిర్వహించిన సమావేశం.. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి, చంద్రబాబునాయుడు చేసిన ప్రతిపాదనలకు ప్రతికూలంగానే ఉందనేది జనం భావన. ఇది చంద్రబాబునాయుడు కొత్త ప్లాన్ కు మొట్టికాయ లాంటి నిర్ణయం అని అంటున్నారు. నిజానికి పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ, దాని నిర్మాణ బాధ్యతలు మొత్తం వారివే అయినప్పటికీ.. కాంట్రాక్టరును మార్చేస్తున్నాం అంటూ చంద్రబాబునాయుడు ఏకపక్షంగా ప్రకటించేసి వారికి ఆగ్రహం తెప్పించే పనిచేశారు. భాజపా నేతలు ఉద్ధండులు గనుక.. తమ కోపాన్ని బయటపెట్టకుండా, విలేకర్లతో భేటీలో.. కాంట్రాక్టరు మార్పు ఉండదని చిన్న ఫీలర్ వదిలారు. దాంతోనే చంద్రబాబు కంగారు పడిపోయి.. అర్జంటుగా నాగపూర్ వెళ్లిపోయి.. గడ్కరీని కన్విన్స్ చేయడానికి తన పాట్లు తాను పడ్డారు. ఎన్ని చేసినా గడ్కరీ మాత్రం ఈ మాయోపాయాలకు లొంగలేదనేది జనాభిప్రాయం. సొమ్ములు మీరు పెట్టుకుంటే తమకు అభ్యంతరం లేదని గడ్కరీ అన్నారంటే.. అది చాలా తీవ్రమైన ప్రతిస్పందనగా భావించాలి. అసలు జీతాలకు, రాజధాని నిర్మాణాలకు డబ్బులేని దైన్యస్థితిలో ఏపీ ఉండగా, జాతీయ ప్రాజెక్టుకు కేంద్రం వంద శాతం నిధులు ఇవ్వాల్సిన చోట వేల కోట్ల రూపాయలు అదనంగా మోయడం వీరికి సాధ్యమేనా.. అని ప్రజలు అంటున్నారు.