Begin typing your search above and press return to search.

ఏపీ సీఎం జ‌గ‌న్‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ‌

By:  Tupaki Desk   |   18 Sep 2021 5:30 PM GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌కు కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి లేఖ‌
X
ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు బీజేపీ నాయ‌కుడు, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. అయితే.. ఈ లేఖ‌లో ఆయ‌న సీఎం జ‌గ‌న్‌పై ఫైర్ అయ్యార‌నే చ‌ర్చ సాగుతోంది. నిజానికి ఎంతో సౌమ్యంగా ఉండే.. కిష‌న్ రెడ్డి.. జ‌గ‌న్ ఫైర‌య్యార‌నే చ‌ర్చపై ఒక్క‌సారిగా రాజ‌కీయ ప్రాధాన్యం పెరిగింది. అయితే.. దీనికి ఎన్నో కార‌ణాలు లేవ‌ని.. కేవ‌లం ఒకే ఒక్క కార‌ణం క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(టీటీడీ) జంబో బోర్డు నియామకం జ‌రిగిన విష‌యం తెలిసిందే. గతంలో టీటీడీ బోర్డు కేవలం 18 మంది సభ్యులకే పరిమితం చేశారు.

అయితే.. వైసీపీ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. ఈ బోర్డు స‌భ్యుల సంఖ్య‌ను విస్తరించే కార్యక్రమం చేపట్టింది. 2019లో ఏర్పాటైన పాలకమండలిలో సభ్యుల సంఖ్యను 18 నుంచీ 37కు పెంచేశారు. ఇప్పుడు ఏకంగా 81కి చేశారు. ఇందులో సభ్యులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులను పక్కనపెడితే... 50 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. పాలక మండలి సభ్యులకు వర్తించే ‘ప్రొటోకాల్‌’ మొత్తం ప్రత్యేక ఆహ్వానితులకూ వర్తిస్తుంది. అంటే... వారితో సమానంగా తగిన మర్యాదలతో శ్రీవారిని దర్శించుకోవచ్చు. దర్శనాలకు సిఫారసులూ చేయవచ్చు. అయితే.. ఇలా పేర్లు పొందిన వారి జాబితాలో.. కొంద‌రు కిష‌న్ రెడ్డి పేరును వాడుకున్నార‌నేది ఇప్పుడు ప్ర‌ధాన చ‌ర్చ‌కు దారితీసింది.

దీనిపై ఓ వ‌ర్గం మీడియాలోనూ ప్ర‌త్యేక క‌థ‌నాలు.. విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో కిష‌న్ రెడ్డి వెంట‌నే రియాక్ట్ అయ్యార‌నేది తాజా అంశం. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేరు ఉపయోగించి ఓ వ్యక్తికి బోర్డులో పదవి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయం కిషన్‌రెడ్డి దాక వెళ్లింది. ఈ వ్యవహారంపై కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు సీఎం జగన్‌కు కిషన్‌రెడ్డి లేఖ రాశారు. తన పేరును దుర్వినియోగం చేయడాన్ని ఆయన లేఖలో ఖండించారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని జగన్‌కు సూచించారు. ఇదిలావుంటే, మ‌రోవైపు టీటీడీ పాలకమండలి నియామకాల్లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇందులో వైసీపీతో పాటు ఏపీ బీజేపీ నేతల పాత్ర కూడా ఉన్నట్లు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. టీటీడీ బోర్డుపై ఒక‌వైపు జంబో బోర్డు అని విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా.. మ‌రో వైపు అవినీతి.. అక్ర‌మ సిఫార్సుల ఉదంతాలు కూడా వెలుగు చూస్తుండ‌డం దీనిపై న్యాయ పోరాటాల‌కు కొంద‌రు రెడీ అవుతుండ‌డం వంటివి విదాదానికి దారితీస్తున్నాయి. మ‌రి ఈ వివాదాల‌కు ఏపీ స‌ర్కారు ఎలా చెక్ పెడుతుందో చూడాలి.