Begin typing your search above and press return to search.

రోడ్ యాక్సిడెంట్!..కేంద్ర మంత్రికి గాయాలు!

By:  Tupaki Desk   |   31 Dec 2017 10:07 AM GMT
రోడ్ యాక్సిడెంట్!..కేంద్ర మంత్రికి గాయాలు!
X
దేశంలో నానాటికీ ర‌హదారుల ప‌రిస్థితి అంత‌కంత‌కూ మెరుగ‌వుతున్నా... అదే క్ర‌మంలో రోడ్డు ప్ర‌మాదాలు కూడా పెరిగిపోతున్నాయి. గుంత‌లు లేని రోడ్ల‌పై రివ్వున దూసుకెళ్లే వాహ‌నాలు.. స్పీడును కంట్రోల్ చేసుకోవ‌డంలో మాత్రం విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పెద్ద ఎత్తున ప్ర‌మాదాలు చోటుచేసుకుంటూ ఉండ‌గా... ఏటా రోడ్డు ప్ర‌మాదాల బారిన ప‌డి చ‌నిపోతున్న వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంద‌నే చెప్పాలి. వీకెండ్ వ‌చ్చిందంటే చాలు... ఫుల్లుగా మ‌ద్యం సేవించే యూత్ వాహ‌నాల‌తో రోడ్ల‌పైకి వ‌స్తూ మ‌రిన్ని ప్ర‌మాదాల‌కు కార‌ణ‌మ‌వుతున్నారు. ఈ త‌ర‌హా ప్ర‌మాదాల‌ను అరిక‌ట్టేందుకు పోలీసులు పెద్ద ఎత్తున చ‌ర్య‌లు చేప‌డుతున్నా.. స్పీడ్ కంట్రోల్ కాక జ‌రుగుతున్న ప్ర‌మాదాల‌ను మాత్రం నివారించ‌లేక, వాటిని ఎలా నివారించాల‌న్న కోణంలో ప్ర‌భుత్వాలు మ‌ల్లగుల్లాలు ప‌డుతున్నాయి.

అయినా ఇప్పుడు రోడ్డు ప్ర‌మాదాల గురించి ఎందుకు ప్ర‌స్తావించుకోవాల్సి వ‌చ్చిందంటే... ప్ర‌దాని న‌రేంద్ర మోదీ ఏరి కోరి త‌న కేబినెట్ సీటిచ్చిన మ‌హిళా మంత్రి అనుప్రియా ప‌టేల్ ఇప్పుడు రోడ్డు యాక్సిడెంట్ బాధితురాలిగా మారిపోయారు మ‌రి. నేటి ఉద‌యం జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో అనుప్రియా ప‌టేల్ స్వ‌ల్ప గాయాల‌తోనే బ‌య‌ట‌ప‌డ్డ‌ప్ప‌టికీ.. ఆమె ప్ర‌మాదానికి గురి అయిన విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. వేరే ఏ వాహ‌న‌మో ఎదురుగా వ‌చ్చి, లేదంటే వెనక నుంచి ఆమె వాహ‌నాన్ని గుద్ద‌లేదు. ప‌టేల్ కాన్వాయ్‌ లోని వాహ‌నాలు ఒక‌దానితో ఒక‌టి ఢీకొన్న కార‌ణంగానే ఈ ప్ర‌మాదం జ‌రిగింది. అంటే కాన్వాయ్‌లోని వాహ‌నాలు స్పీడును కంట్రోల్ చేసుకోలేక ఒక‌దానితో ఒక‌టి ఢీకొన్నాయ‌న్న మాట‌.

ఈ ప్ర‌మాదానికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళితే... నేటి ఉద‌యం అల‌హాబాదు ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అనుప్రియా ప‌టేల్ న‌గ‌రంలోని ట్రాఫిక్ లేని రోడ్డుపై వేగంగా దూసుకువెళుతున్న త‌న కాన్వాయ్‌ లో వెళుతున్నారు. ఈ క్ర‌మంలో స‌ద‌రు కాన్వాయ్‌ లోని వాహ‌నాలు అదుపు త‌ప్పి ఒక‌దానితో మ‌రొక‌టి ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో అనుప్రియా ప‌టేల్కు స్వల్ప గాయాల‌య్యాయి. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే వేగంగా స్పందించిన పోలీసులు కేంద్ర మంత్రిని హుటాహుటిన ఆసుపత్రికి త‌ర‌లించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి బాగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.