Begin typing your search above and press return to search.

ఏపీకి ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం ఇవ్వడం కుదరదట !

By:  Tupaki Desk   |   23 March 2021 1:30 PM GMT
ఏపీకి ప్రత్యేక హోదాపై తేల్చేసిన కేంద్రం ఇవ్వడం కుదరదట !
X
ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్న విషయం మరోసారి పార్లమెంట్ వేదికగా తేటతెల్లం అయింది. ఏపీకి రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చామని, ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదు అని కేంద్రం కుండబద్దలు కొట్టినట్టు స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఏపీకి ప్రత్యేక హోదా వీలుకాదని తెలిపింది. రాష్ట్ర పునర్విభజన చట్టం అమలుపై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రం నుంచి వివరణ కోరారు. అయితే కేంద్రం ఇచ్చిన జవాబు సంతృప్తికరంగా లేదని చెప్పడంతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ స్పందించారు.

ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య అసంపూర్తిగా ఉన్న సమస్యల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయన్న కేంద్రమంత్రి, పరిష్కారం మాత్రం తమ చేతుల్లో లేదన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలన్నారు. మొత్తానికి ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యయమని గతంలోనే స్పష్టం చేసిన కేంద్రం ఇదే విషయాన్ని మరోసారి తేల్చిచెప్పింది.

ఏపీ ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్.. పునర్విభజన చట్టంలో ఇతర అంశాలపైనా స్పందించారు. హోదా కాకుండా చట్టంలో చాలా అంశాలున్నాయని, వాటిని పరిష్కరించడానికి కేంద్రం తన వంతు ప్రయత్నం చేస్తున్నదని, ఇప్పటివరకు ఇరు రాష్ట్రాల అధికారులతో 24 సమీక్ష సమావేశాలు నిర్వహించామని తెలిపారు. ప్రాజెక్టులు, విద్యాసంస్థల నిర్మాణం సుదీర్ఘకాలం పడుతుందని, మరికొన్ని విభజన హామీలు వివిధ దశల్లో ఉన్నాయని, అయితే చాలా అంశాలనురెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పరిష్కరించుకోవాలి అని తెలిపారు.

దీనితో సభలో ఉన్న ఏపీకి చెందిన ఎంపీలు అందరూ కూడా ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రత్యేక హోదా ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లయినా పునర్విభజన చట్టంలోని అంశాలు నెరవేరలేదని తెలిపారు. అందుకు గల కారణాలు ఏంటో కేంద్రం చెప్పాలని అన్నారు. తమకు ఎలాంటి ప్యాకేజీ అవసరం లేదని, ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మరోసారి స్పష్టం చేశారు.