Begin typing your search above and press return to search.

డాక్టరమ్మ హ్యాపీగా లేదట.. అందరిని చంపేసింది!!

By:  Tupaki Desk   |   20 Aug 2020 11:45 AM IST
డాక్టరమ్మ హ్యాపీగా లేదట.. అందరిని చంపేసింది!!
X
ఇదెక్కడి పోయే కాలమో అర్థం కాని పరిస్థితి. చనిపోవటానికి.. చావటానికి పెద్ద కారణాలు లేకుండా ఉండటం కొద్దిమందిలో చూస్తుంటాం. కానీ..చంపే విషయంలోనూ ఇప్పుడు కొత్త తీరు కనిపిస్తోంది. చిన్నకారణాలతో.. తమకు అత్యంత సన్నిహితుల్ని చంపేసేందుకు సిద్ధపడిపోవటం షాకింగ్ గా మారింది. అయినోళ్లను.. అందునా కుటుంబ సభ్యుల్ని చంపే ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు. వివాహేతర సంబంధాల కోసం కొంతమంది తమ కుటుంబ సభ్యుల్ని చంపేస్తుంటే.. చిన్న చిన్న మానసిక కారణాలతోనూ అయిన వారిని బలి తీసుకునే వైనాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా చెప్పే ఉదంతం ఈ కోవకు చెందిందే.

మహారాష్ట్రకు చెందిన ఒక వైద్యురాలు.. సంతోషంగా లేని కారణంగా కుటుంబం మొత్తాన్ని బలి తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది. విన్నంతనే వణుకు పుట్టే ఈ ఉదంతం ఆ రాష్ట్రంలోని నాగపూర్ నగరంలో చోటు చేసుకుంది. భర్త.. ఇద్దరు పిల్లలతో ఉన్న ఆమెకు బతకు ఎందుకో సంతోషంగా లేదనిపించిందట. సదరు యువతి వైద్యురాలు కాగా.. భర్త ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. పదకొండేళ్లు.. ఐదేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. వారంతా కొరాడి ప్రాంతంలో నివసిస్తుంటారు.

జీవితంలో ఆనందంగా లేదన్న వేదన ఎక్కువైన వైద్యురాలు.. భర్తను.. ఇద్దరుపిల్లల్ని చంపేసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ముందుగా వారికి భోజనంలో విషం పెట్టిన ఆమె.. తర్వాత గుర్తు తెలీని ఇంజెక్షన్లు చేసి.. వారిని బలి తీసుకుంది. అనంతరం.. తనను తాను సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని చనిపోయింది. అదే ఇంట్లో ఉండే ఆత్తగారు.. ఈ సామూహిక హత్యలు జరిగిన తెల్లారి.. ఎంతకు తమ రూంలో నుంచి బయటకు రాకపోవటంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది.

దీంతో.. వారొచ్చి తలుపులు పగలగొట్టి చూడగా.. అందరూవిగతజీవులుగా ఉన్నారు. వాడేసిన ఇంజెక్షన్లు.. ఒక సూసైడ్ లెటర్ లభించింది. తమ జీవితం ఆనందంగా లేని కారణంగా ఇలా చేస్తున్నట్లుగా ఆమె పేర్కొన్నారు. ఎంత ఆనందంగా లేకపోతే మాత్రం.. అందరిని చంపేసి..తాను చనిపోవటం ఏమిటన్న మాట వినిపిస్తోంది. అందరిని పోస్టుమార్టం కు తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.