Begin typing your search above and press return to search.

గంజి ప్ర‌సాద్ హత్య కేసులో ఊహించ‌ని ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..

By:  Tupaki Desk   |   30 April 2022 2:02 PM GMT
గంజి ప్ర‌సాద్ హత్య కేసులో ఊహించ‌ని ట్విస్ట్‌.. ఏం జ‌రిగిందంటే..
X
ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీస్స్టేషన్లో నిందితులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఈ హత్యను తామే చేశామంటూ సురేష్, మోహన్, హేమంత్లు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయారు. నిందితులు ముగ్గురూ ఎంపీటీసీ సభ్యుడు బజారియా వర్గీయులు కావడం గమనార్హం. హతుడు గంజి ప్రసాద్కు, బజారియాకు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకవైపు ఈ హత్య.. వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావే చేయించాడంటూ వైసీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే.. మృతుడు గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు రాగా.. ఆయనపై గ్రామంలోని వైసీపీ కార్యకర్త లంతా మూకుమ్ముడిగా దాడికి పాల్పడిన కొద్ది నిమిషాల్లోనే నిందితులు లొంగిపోవడం గమనార్హం. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఈ రోజు ఉద‌యం తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది.

జి.కొత్తపల్లిలో పాల కోసం బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ వైసీపీ నాయకుడు గంజి ప్రసాద్ ను కొంద‌రు అత్యంత దారుణంగా హత్య చేశారు. దీంతో ఇది వైసీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య చోటు చేసుకున్న వివాదంంలో భాగ‌మేన‌ని స్తానికంగా చ‌ర్చ‌జ‌రిగింది.

ఇదిలావుంటే.. హత్యకు గురైన వైసీపీ నాయకుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. గ్రామంలోని వైసీపీలో ఇరువర్గాలు ఉన్నాయని.. అందులో ఓ వర్గానికి ఎమ్మెల్యే మద్దతు ఇవ్వడం వల్లే గంజి ప్రసాద్‌ హత్య జరిగిందని మరో వర్గం ఆరోపిస్తోంది.

అందువల్లే ఎమ్మెల్యేపై దాడికి దిగినట్లు సమాచారం. గంజి ప్రసాద్ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేను.. పార్టీలోని ఓ వర్గం అడ్డుకుంది. కొందరు ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై దాడి చేశారు. వెంటనే పోలీసులు ఎమ్మెల్యేకు రక్షణగా నిలబడి.. పక్కకు తీసుకెళ్లారు.

అయినా.. కొందరు వైసీపీ నేతలు, కార్యకర్తలు వెంటపడి మరీ.. ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే వెంకట్రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పోలీసులు ఆయనను ఉంచిన చోట ఆందోళనకు దిగారు. దీంతో.. గ్రామంలో ఉద్రిక్తత కొనసాగ‌డంతో ప్ర‌స్తుతం ఇక్క‌డ 114 వ సెక్ష‌న్ విధించారు. ప‌లువురు నాయ‌కుల‌ను సైతం పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో హ‌త్య చేసిన వారు లొంగి పోవ‌డం .. ప్రాధాన్యం సంత‌రించుకుంది.