Begin typing your search above and press return to search.

అనూహ్యం.. పనస ఆయన ప్రాణాల్ని తీసింది.. అదెలానంటే?

By:  Tupaki Desk   |   4 July 2021 11:00 AM IST
అనూహ్యం.. పనస ఆయన ప్రాణాల్ని తీసింది.. అదెలానంటే?
X
చావు తన మీద వేసుకోదని పెద్దలు చెబుతుంటారు. ఏదో ఒక కారణం మరణం చుట్టూ ఉంటుందని.. ఆ కారణంతోనే చావు వచ్చిందే తప్పించి.. తనను నిందించే అవకాశం మృత్యువు ఇవ్వదన్న వైనం తాజా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఉదంతాన్ని చూస్తే.. ముంచుకొచ్చే చావును ఎవరూ ఆపలేరేమో? అన్న భావన కలగటం ఖాయం.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో చోటు చేసుకున్న ఈ ఉదంతం గురించి విన్నవారంతా అవాక్కు అవుతున్నారు. మాజీ కౌన్సిలర్ గా.. వ్యాపారవేత్తగా సుపరిచితుడైన 66ఏల్ల మాటూరి నారాయణమూర్తి తన ఇంట్లోని పెరట్లో పనస చెట్టును పెంచుతున్నారు. భారీగా పూసిన పూతతో ఆయన పనస కాయ కోయాలని డిసైడ్ అయ్యారు. భారీ సైజులో ఉండే పనసను పట్టుకోవటం అంత తేలికైన విషయం కాదు. దీనికి తోడు కాయ చుట్టూ ముల్లుగా ఉండే నేపథ్యంలో.. పనసకాయను పట్టుకునేందుకు పెద్ద గోనె సంచెను వాటంగా పట్టుకుంటారు.

పైన కాయ కోస్తుంటే.. అవి కీంద పడకుండా ఉండేందుకు గోనె సంచిని పట్టుకొని చెట్టు కింద నిల్చుంటారు. అలానే నిలుచున్న నారాయణమూర్తికి దురదృష్టం వెంటాడింది. సంచి పట్టుకున్న ఆయన అంచనాలకు భిన్నంగా పైన కోసిన పనస కాయ నేరుగా వచ్చి ఆయన ముఖాన్ని తాకింది. ఈ పరిణామాన్ని ఆయన ఊహించలేకపోయారు. దీంతో.. అదుపు తప్పి ఆయన వెనక్కి పడిపోయారు. కింద సిమెంట్ రోడ్డు ఉండటం.. అదుపు తప్పి కింద పడిన ఆయన తల నేలను బలంగా తాకింది.

దీంతో.. తీవ్ర గాయానికి గురయ్యారు. చికిత్స కోసం హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే.. వెహికిల్ లో ఎక్కించే వేళలోనే ఆయన ప్రాణాల్ని కోల్పోయారు. పనసకాయ కోసే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన ఉదంతం అక్కడి వారిని షాక్ గురయ్యేలా చేసింది. దీంతో.. ఆయన కుటుంబ సభ్యులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు. చావు ముంచుకొస్తే.. ఇలాంటి అనూహ్య పరిణామాలే చోటు చేసుకుంటాయేమో?