Begin typing your search above and press return to search.

యునెస్కో గుర్తింపు వేళ.. రామప్పకు ఎలా వెళ్లాలి? అక్కడి ప్రత్యేకతలివే..!

By:  Tupaki Desk   |   26 July 2021 4:44 AM GMT
యునెస్కో గుర్తింపు వేళ.. రామప్పకు ఎలా వెళ్లాలి? అక్కడి ప్రత్యేకతలివే..!
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో మరెక్కడా లేని రీతిలో అత్యుద్భత శిల్పరీతులతో చూపురులను ఇట్టే కట్టిపడేసే రామప్ప దేవాలయానికి తాజాగా యునెస్కో గుర్తింపు లభించటం.. ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందటం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదన్నట్లుగా.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న రామప్ప దేవాలయానికి ఉన్న విశిష్టత అందరికి తెలిసిందే అయినా.. దాన్ని ప్రత్యేకంగా పట్టించుకోని పరిస్థితి. తాజాగా యునెస్కో గుర్తింపు నేపథ్యంలో రామప్ప టెంపుల్ ను సందర్శించేందుకు ఆసక్తి వ్యక్తమవుతోంది.

ఇంతకాలం రామప్ప టెంపుల్ గురించి తెలిసినా.. వరంగల్ జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న ఈ టెంపుల్ కు వెళ్లేందుకు వీలైన మార్గం ఏమిటి? రామప్పను ఎలా చేరుకోవాలి? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. ఇంతకూ రామప్ప టెంపుల్ కు ఎలా చేరుకోవాలంటే..

వరంగల్ కు 77 కిలోమీటర్ల దూరంలో రామప్ప టెంపుల్ ఉంది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలంపేటలో ఈ అత్యుద్భుత దేవాలయం ఉంది. మరి.. ఫ్లైట్ జర్నీ చేసి ఇక్కడకు చేరుకోవాలంటే.. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవటం.. అక్కడి నుంచి కారులో రామప్ప టెంపుల్ కు చేరుకోవటం మినహా మరో మార్గం లేదు. అదే రైలు మార్గంలో అయితే.. వరంగల్ నగరంలోని శివారులో ఉండే కాజీపేట జంక్షన్ లో దిగి.. అక్కడి నుంచి బస్సులు కానీ ప్రైవేటు వాహనాల్లో రామప్పకు చేరుకోవచ్చు.

ఇక ప్రజా రవాణా అయిన బస్సులో వెళ్లాలంటే తొలుత వరంగల్ లోని హన్మకొండ బస్టాండ్ కు చేరుకోవాలి. అక్కడి నుంచి ములుగువెళ్లే బస్సు ఎక్కి వెంకటాపురంలో దిగాలి. అక్కడి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో పాలంపేటలో రామప్ప దేవాలయం ఉంటుంది. అక్కడికి ఆటోలో కానీ ప్రైవేటు వాహనంలో వెళ్లొచ్చు. ఇప్పటివరకు ఈ దేవాలయాన్ని చూసేందుకు నెలకు సగటున దేశీయ పర్యాటకులు పాతిక వేల మంది.. విదేశీయులు 20 మంది మాత్రమే వస్తున్నారు. యునెస్కో వారసత్వ కట్టటం గుర్తింపు పుణ్యమా అని లక్షల్లో వచ్చే వీలుంది.

రామప్ప టెంపుల్ ను డెవలప్ చేసేందుకు ఇప్పటికే పలు ప్రణాళికల్ని సిద్ధం చేశారు. రూ.5 కోట్లతో ఆడిటోరియం.. రెండు స్వాగత తోరణాలు.. ఆలయం పక్కన చెరువు.. మధ్యలో ఉన్న ద్వీపంలో భారీ శివలింగం ఏర్పాటుకు నమూనా సిద్ధం చేశారు. 10 ఎకరాల స్థలంలో శిల్ప కళావేదిక.. శిల్పుల కోసం.. శిల్పకళా అధ్యయనం కోసం కళాశాల ఏర్పాటు చేయనున్నారు.

రామప్ప విలక్షణత ఇదే..

- కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి వద్ద సైన్యాధ్యక్షుడిగా పనిచేసిన రేచర్ల రుద్రుడు 1213వ సంవత్సరంలో రామప్ప ఆలయాన్ని కట్టించాడు. కాకతీయుల సామ్రాజ్యంలో ఎన్నో అద్భుత ఆలయాల నిర్మాణం జరిగినా రామప్ప ఎంతో ప్రత్యేకమైనది. ఆలయం నిర్మాణంలో ఎక్కువగా ఎర్ర ఇసుకరాయిని వాడారు.

- కీలకమైన ద్వార బంధాలు, స్తంభాలు, పైకప్పు, మదనిక, నాగనిక శిల్పాలు, నంది విగ్రహం, గర్భాలయంలోని శివలింగాలకు మాత్రం అత్యంత కఠినమైన బ్లాక్‌ డోలరైట్‌ రాయిని వాడారు.

- సాధారణంగా పునాదులపై నేరుగా ప్రధాన ఆలయ భాగం ఉంటుంది. కానీ రామప్పలో దాదాపు ఆరడుగుల ఎత్తుతో నక్షత్రాకారపు ఉపపీఠం ఏర్పాటు చేసి.. దాని మీద ప్రధాన ఆలయాన్ని నిర్మించారు.

- వాన నీళ్లు ఐదారు అడుగుల దూరం పడేలా పైకప్పులో ప్రత్యేకంగా రాతిచూరు ఏర్పాటు చేశారు. దాని అంచుల్లో ఉన్న ప్రత్యేక నగిషీల మీదుగా వాన నీళ్లు దూరంగా పడే ఏర్పాటు దీని సొంతం.

- ఇది హిందూ ఆలయమే అయినప్పటికీ ప్రవేశ ద్వారం.. రంగమండపటం అరుగు లాంటి పలు చోట్ల జైన తీర్థంకరులు.. బౌద్ధమూర్తుల చిత్రాలుఉంటాయి. నాట్య గణపతి, ఆయుధాలు ధరించిన యోధులు, భటులు, భైరవుడు, వేణుగోపాలస్వామి, మల్లయుద్ధ దృశ్యాలు, నాట్యగత్తెలు, వాయిద్యకారులు, నాగిని, సూర్య, శృంగార శిల్పాలెన్నో.

- గర్భాలయ ప్రవేశానికి పక్కనే గోడకు చెక్కిన వేణుగోపాలస్వామి విగ్రహాన్ని సున్నితంగా మీటితే సప్తస్వరాలు వినిపించం దీని ప్రత్యేకత. 800 ఏళ్ల క్రితం కట్టినా.. ఇప్పటికి అలుపుసొలుపు లేకుండా తనను మీటిన వారందరికి సప్తస్వరాలు వినిపిస్తూ ఉండటం విశేషం.

- ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా నీటిపై తేలే ఇటుకలను శిఖర నిర్మాణంలో వాడారు. బంకమట్టి, తుమ్మ చెక్క, కరక్కాయ తొక్కలు, వట్టివేళ్లు, ఊక తదితరాల మిశ్రమాన్ని పోతపోసి కాల్చి ఈ ఇటుకలను తయారు చేశారు. కప్పు వరకు రాతితో నిర్మించి మూడంతస్తుల శిఖరాన్ని ఇటుకలతో కట్టారు. బరువు తక్కువగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేశారు.

- ఆలయంలో భారీ రాతి స్తంభాలు, మదనిక–నాగనిక శిల్పాలు అద్దం వంటి నునుపుతో ఉంటాయి. ఎలాంటి యంత్రాలు లేని ఆ కాలంలో రాళ్లను అద్దాల్లా చెక్కడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ముఖ్యంగా రంగమండపం మధ్యనున్న నాలుగు స్తంభాలు, దూలాలు, కప్పు రాళ్లలో అద్దం చూసినట్టుగా మన ప్రతిబింబం కనిపించి కనువిందు చేస్తుంది.

- ఆలయ గోడలపై ఓ శిల్పం విదేశీ వస్త్రధారణతో చిత్రంగా కనిపిస్తుంది. ఆ కాలంలో వచ్చిన విదేశీ పర్యాటకుల వేషధారణ ఆధారంగా ఆ శిల్పాన్ని చెక్కారన్న అభిప్రాయం ఉంది. హైహీల్స్‌ను పోలిన చెప్పులు ధరించిన ఓ యువతి శిల్పం, తల వెంట్రుకలను మలిచిన తీరు, చెవులకు పెద్దసైజు దిద్దులు అబ్బురపరుస్తాయి.

- ఇక్కడి ఆగ్నేయ స్తంభంపై అశ్వపాదం, నాట్యగణపతి, శృంగార భంగిమలో ఉన్న దంపతులు, సైనికుడు అతని భార్య, నాట్యగత్తెల చిత్రాలున్నాయి. నైరుతి స్తంభంపై నాట్యగత్తెలు, రతీ మన్మథ, సాగరమథనం దృశ్యాలు, వాయవ్య స్తంభంపై గోపికా వస్త్రాపహరణం, నాటగాళ్లు, ఈశాన్య స్తంభంపై నగిషీలు కనిపిస్తాయి.