Begin typing your search above and press return to search.

సొంత పార్టీ నేత‌ల‌పై ఉండ‌వ‌ల్లి ఫైర్‌.. ఆ ఎమ్మెల్యే స్ట‌యిలే డిఫ‌రెంట్‌!

By:  Tupaki Desk   |   17 Sept 2021 9:00 AM IST
సొంత పార్టీ నేత‌ల‌పై ఉండ‌వ‌ల్లి ఫైర్‌.. ఆ ఎమ్మెల్యే స్ట‌యిలే డిఫ‌రెంట్‌!
X
గుంటూరు జిల్లా తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యం దక్కించుకున్న డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి స్ట‌యిలే డిఫ‌రెంట్. సొంత పార్టీలో నేత‌ల‌తో ఆమె ఎప్పుడూ.. ఏదో ఒక వివాదంతో మునిగి తేలుతుంటా ర‌ని అంటారు సీనియ‌ర్లు.ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుతో వివాదంచాన్నాళ్లుగా కొన‌సాగుతోంది. ఇక‌, రాజ‌ధాని అమ‌రావ‌తి రైతుల‌ను రెచ్చ‌గొట్టి వివాదానికి తెర‌దీయ‌డంలోనూ ఆమెను మించిన వారు లేర‌ని చెబుతారు. ఎప్పుడూ.. వివాదాల‌కు కేంద్ర‌గా ఉండే.. శ్రీదేవి.. మ‌రోసారి .. సొంత పార్టీలో చ‌ర్చ‌కు దారితీశారు.

సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న జ‌గ‌న‌న్న ఇళ్ల ప‌థ‌కానికి సంబంధించి.. అంతా త‌న ఇష్ట ప్ర‌కార‌మే జ‌ర‌గాల‌ని ఉండ‌వ‌ల్లి పట్టు బ‌డుతున్నారు. అయితే.. గుంటూరుకు చెందిన తూర్పు, వెస్ట్ ఎమ్మెల్యేలు మాత్రం మా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌ల‌కు ఇక్క‌డ ఇళ్లు ఇస్తున్నారు క‌నుక .. మా ప్ర‌మేయం కూడా ఉంటుంద‌ని తేల్చి చెబుతున్నారు. దీంతో ఉండ‌వ‌ల్లికి .. ఈ ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదం.. రాజుకుంది.

శ్రీదేవి నియోజ‌క‌వ‌ర్గం తాడికొండ ప‌రిధిలోని పేరేచర్ల, లాం లో పేద‌ల‌కు కేటాయించిన ఇళ్ల‌ స్థలాలు తన నియోజకవర్గం పరిధిలో ఉన్నందున ఆయా ఇళ్ల‌కు ప్ర‌భుత్వం క‌ల్పించే మౌలిక సదుపాయాల కల్పన తన కనుసన్నలలోనే జరగాలని తాడికొండ ఎమ్మెల్యే భావిస్తు న్నారు. అయితే.. లబ్ధిదారులంతా తమ నియోజకర్గాల పరిధిలోని వారేనని వారి పనులు మేము దగ్గరుండి జరిపిస్తే తమకు ప్రయోజనం అని గుంటూరు నగర ఎమ్మెల్యేలు తూర్పు ఎమ్మెల్యే ముస్త‌ఫా, ప‌శ్చిమ ఎమ్మెల్యే గిరి లు ప‌ట్టుబ‌డుతున్నారు.

ప్రభుత్వం జగనన్న కాలనీల కోసం గుంటూరు నగరవాసులకు సమీపంలోని పేరేచర్ల, లాం గ్రామాల్లో ఇళ్లస్థలాలను కొనుగోలు చేసింది. ఇందులో ప్రస్తుతం రూ.కోట్లు వ్యయం చేసి మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లెవలింగ్‌, అంతర్గత రోడ్లు, విద్యుదీకరణ, డ్రైనేజ్‌ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. ఈ స్థలాలను పరిశీలించేందుకు హౌసింగ్‌, గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి చెరకువాడ శ్రీరంగనాథరాజు గుంటూరు నగరానికి వచ్చారు. ముందుగా ఆయన తాడికొండ నియోజకవర్గ పరిధి పేరేచర్లలోని స్థలాల వద్దకు వెళ్లారు.

ఈ పర్యటనలో ఆయనతో పాటు గుంటూరు తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముస్తాఫా, మద్దాలి గిరిధర్‌లతో పాటు నగర మేయర్‌ కావటి మనోహర్‌నాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు. అయితే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు ఎలా వ‌స్తార‌నేది ఆమె వాద‌న‌. ఇక‌, ఆ తర్వాత అదే నియోజకవర్గం పరిధిలోని లాంలో స్థల పరిశీలనకు ముందుగా నిర్ణయించిన ప్రోగ్రాం ప్రకారం ఇన్‌చార్జి మంత్రి వెళ్లాల్సి ఉంది. అయితే ఆయనకు అప్పటికే పరిస్థితి అర్థమవటంతో లాం పర్యటనను రద్దుచేసుకొని వెనుదిరిగి వెళ్లిపోయారు.

ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన పొలాల వ్యవహారంలో కూడా అప్పట్లో స్థానిక ప్రజాప్రతినిధులకు ఎక్కడికక్కడ భారీఎత్తున ముడుపులు అందాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఒక్కో ఎకరానికి రైతుల నుంచి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు ప్రజాప్రతినిధుల పేరు చెప్పి వసూలు చేశారు. అంతటితో సరిపెట్టుకోకుండా ఇప్పుడు ఆ స్థలాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కేటాయించే కోట్లాది రూపాయలుపై ప్రజాప్రతినిధుల కన్నుపడిందనే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్పటికే స్థలాల మెరక పేరుతో భారీగా నిధులు నొక్కేసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేరేచర్లలో 390 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి సుమారు 14,000మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అలాగే లాంలో 115 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు కేటాయించి దాదాపు 5,420 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ స్థలాల పనుల్లో పెత్తనం కోసమే గుంటూరు నగర ఎమ్మెల్యేలకు, తాడికొండ ఎమ్మెల్యేకు మధ్య వివాదం తలెత్తిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మ‌రి ఇది మున్ముందు పెరుగుతుందా? ఇక్క‌డితో ఆగుతుందా? అనేది చూడాలి.