Begin typing your search above and press return to search.

మార్గదర్శిని వదలనంటోన్న ఉండవల్లి

By:  Tupaki Desk   |   18 Dec 2019 12:02 PM IST
మార్గదర్శిని వదలనంటోన్న ఉండవల్లి
X
మీడియా మొఘల్ రామోజీకి కంటి మీద కునుకు లేకుండా చేసిన ఉదంతాల్లో మార్గదర్శి ఫైనార్షియర్స్ ఇష్యూగా చెబుతారు. దివంగత మహానేత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెర మీదకు వచ్చిన ఈ వ్యవహారం అప్పట్లో పెను సంచనలంగా మారింది. నైతికంగా రామోజీ తప్పు చేశారా? లేదా? అని వాదించేవారంతా చట్టప్రకారం తప్పు చేశారన్న అభిప్రాయం అప్పట్లో వినిపించేది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో మార్గదర్శి ఇష్యూ ఎంతటి కలకలాన్ని రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ అంశంపై ఉమ్మడి హైకోర్టు ఆదేశాల్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మార్గదర్శి ఫెనాన్షియర్స్ కేసులో ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఆయన కోరారు.

ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు విభజనకు సరిగ్గా ఒక రోజు ముందు 2018 డిసెంబరు 31న వెలువడిన తీర్పును తన పిటిషన్ లో పేర్కొన్న ఉండవల్లి.. ఈ కేసులో రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్ని భాగస్వామ్యుల్ని చేయాలంటూ మరో దరఖాస్తును దాఖలు చేశారు.

అవిభక్త హిందూ కుటుంబ సంస్థ అయిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ .. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టంలోని 45(ఎస్) రూల్ ను ఉల్లంఘించి ప్రజల నుంచి డిపాజిట్లను వసూలు చేశారని.. ఉమ్మడి హైకోర్టు ఈ చట్టంలోని సెక్షన్ 45(ఎస్)ను తప్పుగా అన్వయించినట్లుగా ఆయన ఆరోపించారు.
అసోసియేషన్ ఆఫ్ ఇండివిడ్యువల్స్ పరిధిలోకి అవిభక్త హిందూ కుటుంబ సంస్థలు రావని.. ఈ నేపథ్యంలో సెక్షన్ 45ఎస్(2) పరిధిలోకి తేవొద్దని చెబుతూ క్రిమినల్ కంప్లయింట్ ను కొట్టివేశారన్నారు. ఈ కారణంగా తన అప్పీళ్లు అన్ని ఫలితం లేకుండా మారాయని.. అందుకే ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన తీర్పును తాను సవాలు చేస్తున్నట్లు ఉండవల్లి పేర్కొన్నారు. చూస్తుంటే.. రామోజీ మార్గదర్శిని ఉండవల్లి ఇప్పట్లో వదిలేట్లుగా కనిపించట్లేదుగా? మరి.. ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ కు సుప్రీం ఏమని బదులిస్తుందో చూడాలి.