Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ర్టాలను కలిపేస్తారా?

By:  Tupaki Desk   |   27 Jun 2015 5:08 AM GMT
తెలుగు రాష్ర్టాలను కలిపేస్తారా?
X
ఉండవల్లి అరుణ్‌కుమార్‌... దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ కు నమ్మిన బంటు అయిన ఉండవల్లి ఆ క్రమంలో కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్నారు. వైఎస్ మరణానంతరం తర్వాతి పరిణామాల్లో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వెంటనడిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని విడదీయాలనే కాంగ్రెస్ పెద్దల నిర్ణయాన్ని బలంగా వ్యతిరేకించిన ఎంపీలలో ఉండవల్లి ఒకరనే పేరుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభించిన జై సమైక్యాంధ్ర పార్టీలోనూ క్రియాశీలంగా వ్యవహరించి....సమైక్యాంధ్ర కోసం నినదించారు. అయితే టైం బ్యాడ్ అవడం వల్ల ఇటీవలి కాలంలో పెద్దగా తెరమీద కనిపించడం లేదు.

కాంగ్రెస్ మాజీ నాయకుడిగా కాకుండా అడపాదడపా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉండవల్లి తాజాగా ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశారు. ఏపీ విభజన అడ్డగోలుగా చేశారనే వాదనను మరోమారు ఆయన పునరుద్ఘాటించారు. విభజనకు వ్యతిరేకంగా అప్పటి ఏపీ అసెంబ్లీ తీర్మానం చేసినా దానిని కాంగ్రెస్ పెద్దలు పరిశీలించలేదని, రాష్రాన్ని రెండుగా విభజించేశారని అన్నారు. తాను సభ్యుడినే అయినప్పటికీ యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టానని, దీంతో తనను సస్పెండ్‌ చేశారని ఉండవల్లి గుర్తుచేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ లేకపోయినా విభజన బిల్లు ప్రవేశ పెట్టారని ఉండవల్లి ఆనాటి పరిణామాలను వివరించారు. అన్నింటికంటే ముఖ్యంగా...పార్లమెంట్‌లో విభజన బిల్లు పాస్‌ కాలేదని, మెజార్టీ లేకపోయినా అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించారని ఉండవల్లి విమర్శించారు.

మెజార్టీ లేకున్నా రాష్ర్టాన్ని విభజన చేయడంపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశానని, తన దగ్గర ఉన్న అన్ని ఆధారాలతో కోర్టులో వాదిస్తానని ఉండవల్లి చెప్పారు. విభజన బిల్లుపై సుప్రీంకోర్టు ''చరిత్రాత్మకమైన, మంచి తీర్పు'' ఇస్తుందనే పూర్తి నమ్మకం తనకుందని అన్నారు. దీంతో పాటు ఎంపీ అయిన తనను పార్లమెంట్‌లో విభజన బిల్లు సమయంలో మాట్లాడనీయకపోవడంపై సైతం కోర్టులో సవాల్‌ చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో సెక్షన్ 8,9,10 అమలు చేయాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు అడగాల్సిన అవసరం లేదని, ఆ సెక్షన్లు కచ్చితంగా అమలు కావాల్సిందేనని ఉండవల్లి స్పష్టం చేశారు. హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయాలని అంబేద్కర్‌ ఆనాడే చెప్పారని, ఇప్పటికైనా మించిపోయింది లేదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం వల్ల పన్నులు ఉండవని ఉండవల్లి అన్నారు.

గతంలో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు....ఏపీని ఐక్యం చేసేందుకు తమ ప్రయత్నాలు కొనసాగించడంలో భాగంగా ఇప్పటికీ సమైక్యాంధ్ర పార్టీ మాజీ నేత అయిన ఉండవల్లి కృషిచేస్తున్నారా? ఈ క్రమంలో కోర్టులో వాదించేది ఈ రీతిలోనే ఉండనుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే...రాజ్యాంగ పరంగా గెజిట్ విడుదల అయిన నేపథ్యంలో విభజన వెనక్కు పోవడం అత్యంత కష్టమైన ప్రక్రియ అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.