Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో ఉండవల్లి భేటీ.. ఏమా కథ?

By:  Tupaki Desk   |   17 July 2018 5:06 AM GMT
చంద్రబాబుతో ఉండవల్లి భేటీ.. ఏమా కథ?
X
ఏపీ సీఎంను ఒక రేంజిలో ఎండగట్టే నేతల్లో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఎంపీగా ఉన్న ఈ నేత విభజన అనంతర పరిణామాలలో ఆ పార్టీకి దూరంగా ఉంటూ మరే ప్రధాన పార్టీకీ చేరువకాలేదు. అయితే... ఇటీవల చంద్రబాబుతో డిఫర్ అయిన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏరికోరి ఉండవల్లిని ఎంచుకుని ఆయనతో అధ్యయనాలు చేయించుకున్నారు. దీంతో ఉండవల్లి వచ్చే ఎన్నికల్లో పవన్‌ కు సలహాసహకారం అందిస్తారని అంతా అంచనాల్లో ఉన్నారు. కానీ... ఇప్పుడు అదే ఉండవల్లికి ఏపీ సీఎం చంద్రబాబు కార్యాలయం నుంచి పిలుపొచ్చింది... అంతేకాదు.. చంద్రబాబునాయుడితో ఆయన ఏకంగా రెండు గంటల పాటు ఏకాంత చర్చలు జరిపారు. ఇదిప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిగ్గా మారింది.

చంద్రబాబుకు ఉండవల్లి లేఖలు రాసిన నేపథ్యంలో ఆయన్ను పిలిపించుకుని చర్చించారని అటు ఉండవల్లి, ఇటు టీడీపీ నేతలు చెప్తున్నారు. అయితే... చంద్రబాబుకు ఇంతకంటే ఎక్కువ లేఖలు రాసిన నేతలను ఎందుకు పిలిచి చర్చించలేదన్న ప్రశ్న వినిపిస్తోంది. కాపు నేత ముద్రగడ పద్మానాభమైతే వారానికో లేఖ రాస్తున్నారు. అయినా, చంద్రబాబు వాటిని కన్నెత్తి చూడడం కూడా లేదు. అలాంటిది ఉండవల్లి లేఖకు స్పందించి పిలిచి మాట్లాడడం రాజకీయంగా చర్చనీయమవుతోంది.

ఏపీ సచివాలయంలో శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సీఎం - ఉండవల్లి ముఖాముఖిగా సుదీర్ఘంగా మాట్లాడుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో తెలుగుదేశం పార్టీకి మద్ధతు ఇవ్వాల్సిందిగా ఆపార్టీ ఎంపీలు లోక్‌సభలోని అన్ని విపక్షాలను కలుస్తోన్న నేపథ్యంలో పార్లమెంటు వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవమున్న ఉండవల్లితో సీఎం భేటీ కావడం విశేషం.

సీఎంను కలిసేందుకు సాయంత్రం 5 గంటలకు సచివాలయం చేరుకున్న ఉండవల్లి 4 గంటలపాటు సీఎం కార్యాలయంలో గడిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆలస్యంగా రాత్రి 7 గంటలకు సచివాలయం చేరుకున్నారు. సచివాలయానికి రాగానే ఆయన కోసం వేచిఉన్న ఉండవల్లితో ఏకాంతంగా చర్చించారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర విభజన అంశంపై టీడీపీ అనుసరించాల్సిన వ్యూహంపై వీరుభయుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

గత పార్ల మెంటు బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఫిబ్రవరి 7న ప్రధాని మోడీ రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన ప్రస్తావిస్తూ రాష్ట్ర విభజన సరిగా జరగలేదని, పార్లమెంటు చరిత్రలో తలుపులు మూసేసి బిల్లు ఆమోదం తెలిపిన ఘటనలు లేవని ఆనాటి ఘటన వలనే ఏపీకి అన్యాయం జరిగిందని ప్రస్తావించారు. సాక్షాత్తూ ప్రధాన మంత్రే పార్లమెంటులో ఈ విషయం మాట్లాడిన తర్వాత అన్యాయానికి గురయ్యామని ఆరోపిస్తున్న రాష్ట్రానికి చెందిన ఎంపీలు అదేవిషయాన్ని పార్లమెంటులో చర్చించడానికి ఎందుకు వెనకాడాలని ఉండవల్లి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసారు. అనంతరం జులై 6న సీఎంకు మరో లేఖ కూడా రాశారాయన. రాష్ట్ర విభజన బిల్లు సక్రమంగా ఆమోదం పొందలే దనే విషయమై ఈ వర్షాకాల సమావేశాల్లో చర్చించి నోటీసు ఇస్తే బావుంటుందని సీఎంకు రాసిన లేఖలో ఉండవల్లి పేర్కొన్నారు. సీఎంకు ఉండవల్లి రాసిన లేఖపై స్పందించి ఈ విషయం గురించి మాట్లాడేందుకు సచివాలయానికి ఉండవల్లిని ఆహ్వానించారు. అయితే ఇప్పటికే ఉండవల్లి తన దగ్గర ఉన్న అఫిడవిట్లను సీఎంకు మెయిల్‌ ద్వారా పంపగా, వాటిని పరిశీలించిన అనంతరం సంబంధిత విషయాలపై ముఖాముఖి చర్చించేందుకు రావాలని సీఎం ఆహ్వానించగా ఉండవల్లి సోమవారం సచివాలయంలో సీఎంను కలిసనట్లు చెప్తున్నారు.