Begin typing your search above and press return to search.

ఆ మాన‌వ మృగాల‌ను ఉరితీయండి:ఐరాస‌

By:  Tupaki Desk   |   14 April 2018 10:02 AM GMT
ఆ మాన‌వ మృగాల‌ను ఉరితీయండి:ఐరాస‌
X
జమ్ము కశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా గ్యాంగ్ రేప్ - హ‌త్య ఘ‌ట‌న దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘటనపై సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల దాకా తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని కోరుతున్నారు. ఆ నిందితుల‌ను ఉరి తీయాల‌ని కూడా కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజాగా, క‌థువా ఘ‌ట‌న‌పై ఐక్యరాజ్య సమితి మండిపడింది. ఆ చిన్నారి గ్యాంగ్ రేప్ - హ‌త్య ను భయానక ఘటనగా అభివర్ణించింది. ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడ్డ వారిని ఉరి తీయాలని భారత ప్రభుత్వాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ కోరారు. భవిష్య‌త్తులో ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా భార‌త ప్ర‌భుత్వం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని గుటెర్ర‌స్ కోరారు.

దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన ఆ ఘ‌ట‌నపై మీడియాలో వచ్చిన కథనాలు చ‌దివి త‌న హృద‌యం ద్ర‌వించిపోయింద‌ని గుటెర్ర‌స్ అన్నారు. ఓ పసి ప్రాణాన్ని అతి కిరాత‌కంగా అత్యాచారం చేసి - హింసించి హత్య చేశారని - దానికి కార‌ణ‌మైన వారిని క్షమించకూడదని అన్నారు. ముక్కు ప‌చ్చ‌లార‌ని ఓ పసి పాప‌ను భయంకర రీతిలో చిత్రవధలకు గురి చేసి నిర్దాక్షిణ్యంగా చంప‌డం క‌న్నా దారుణం మ‌రోటి ఉండ‌ద‌ని ఆయ‌న అన్నారు. ఈ అమానుష చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డ‌ మానవ మృగాలను క్షమించకూడద‌ని చెప్పారు. ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఆ దారుణానికి కార‌ణ‌మైన వారిని తక్షణమే ఉరి తీసి ఆ చిన్నారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాన‌ని చెప్పారు. ఒక్క భార‌త్ లోనే కాకుండా మాన‌వ‌జాతికి మ‌చ్చ తెచ్చే ఇటువంటి ఘటనలు మరెక్కడా జరగకూడదని కోరుకుంటున్నాని తెలిపారు. గుటెర్రెస్ సందేశాన్ని ఆయన ప్రతినిధి స్టీఫెన్‌ దుజ్జారిక్‌ శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.

ఐరాస స్పంద‌న సాధార‌ణం కంటే ఈరోజు భిన్నంగా ఉంది. చ‌ట్టాల కంటే మ‌న‌సు గొప్ప‌ది. మ‌నిషి జీవితం గొప్పది. గౌర‌వ‌మైన జీవ‌న హ‌క్కు గొప్ప‌ది... అని ఘంటా ప‌థంగా చెబుతూ ఐరాస స్పందించిన తీరు ప్ర‌తి భార‌తీయుడి మ‌న‌సులో ర‌గులుతున్న మాటే!