Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుకి ఉమా మాధ‌వ రెడ్డి గుడ్‌ బై

By:  Tupaki Desk   |   21 July 2016 9:57 AM GMT
చంద్ర‌బాబుకి ఉమా మాధ‌వ రెడ్డి గుడ్‌ బై
X
తెలంగాణ టీ టీడీపీ నేత‌లు ఒక్కొక్క‌రుగా త‌మ అధినేత‌కు గుడ్‌ బై చెబుతున్నారు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఫాంలో ఉన్న నేత‌లే వెళ్లిపోతే.. ఇప్పుడు తాజాగా అంత గా ఫామ్‌ లో లేని నేత‌లు - ఎప్పుడో ఒక‌ప్పుడు పార్టీకి ప‌నికి వ‌స్తారుగా అని అనుకున్న నేత‌లు కూడా త‌మ భ‌విష్య‌త్తుకోసం చంద్ర‌బాబుకు గుడ్‌ బై చెబుతున్నారు. వారి వ‌రుస‌లో చేరిపోయారు ఎలిమినేటి ఉమా మాధ‌వ‌రెడ్డి. ఈమె గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో బాగానే చ‌క్రం తిప్పారు. ఈమె భ‌ర్త ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి టీడీపీలో ప్ర‌ధాన నేత‌గా - ఏపీ హోంశాఖ మంత్రిగా కూడా ప‌నిచేశారు.

ఆయ‌న హోం మంత్రిగా ఉన్న‌ప్పుడు న‌క్స‌ల్స్ జ‌రిపిన దాడిలో 2000 సంవ‌త్స‌రంలో హ‌ఠాన్మ‌రణం చెంద‌డంతో ఆయ‌న భార్య‌గా ఉమా రాజ‌కీయ అరంగేట్రం చేశారు. దీంతో చంద్ర‌బాబు ఆమెకు కేబినెట్‌ లో మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. న‌ల్ల‌గొండ టీడీపీ రాజ‌కీయాల్లో త‌మకంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొంద‌డ‌మే కాకుండా భువ‌న‌గిరిలో ఎలిమినేటికి ఎదురులేద‌నే మాట కూడా పొందారు.

అయితే, రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన ప‌రిణామాల నేప‌థ్యంలో తెలంగాణ‌లో టీడీపీ అస్థిత్వ‌మే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. దీంతో ఉమా మాధ‌వ రెడ్డిని ప‌ట్టించుకునే నాథుడు టీడీపీలో క‌రువ‌య్యారు. దీంతో గ‌త కొన్నాళ్లుగా స్త‌బ్దుగా ఉన్న ఉమా.. టీ టీడీపీలో త‌న‌కు భ‌విష్య‌త్తు లేద‌ని, పార్టీ మార‌ట‌మే ఉత్త‌మ‌మ‌ని అని డిసైడ‌య్యార‌ట‌. అయితే, టీఆర్ ఎస్ వైపు చూసినా.. అక్క‌డి నుంచి ఎలాంటి సిగ్న‌ల్స్ రాక‌పోవ‌డం, పైగా న‌ల్ల‌గొండ‌లో టీఆర్ ఎస్‌ కు నాయ‌కులు చెట్టుకొక‌రు పుట్ట‌కొక‌రుగా ఉండ‌డంతో ఇప్పుడు ఆమె చూపు హ‌స్తం నేత‌ల వైపు మ‌ళ్లింద‌ని స‌మాచారం.

మ‌రోప‌క్క‌ - కాంగ్రెస్‌ కు న‌ల్ల‌గొండ‌లో ముఖ్యంగా భువ‌న‌గిరిలో జెండాను కాపాడే నాయ‌కులు క‌రువ‌య్యారు. దీంతో సీనియ‌ర్ కాంగ్రెస్ నేత జానారెడ్డి.. ఉమాకు ఆఫ‌ర్ ఇచ్చార‌ని తెలిసింది. దీంతో ఆమె సైకిల్ దిగి హ‌స్తం అందుకోవాల‌ని సిద్ధంగా ఉన్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టికే జానా-ఉమా మ‌ధ్య చ‌ర్చ‌లు కూడా జ‌రిగిన‌ట్టు స‌మాచారం. అయితే, ఈ విష‌యాన్ని త‌మ అధినేత చంద్ర‌బాబుకు చెప్పి పార్టీ నుంచి త‌ప్పుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట ఆమె. ఇదే గ‌నుక జ‌రిగితే.. భువ‌న‌గిరిలో టీడీపీ అడ్ర‌స్ గ‌ల్లంత‌యిన‌ట్టే.