Begin typing your search above and press return to search.

న‌యిం ఇష్యూపై ఉమా మాధ‌వ‌రెడ్డి నోరు విప్పారు

By:  Tupaki Desk   |   11 Aug 2016 8:12 AM GMT
న‌యిం ఇష్యూపై ఉమా మాధ‌వ‌రెడ్డి నోరు విప్పారు
X
దారుణ నేరాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన గ్యాంగ‌స్ట‌ర్ న‌యిం వ్య‌వ‌హారంలో మాజీ మంత్రి ఒక‌రికి సంబంధం ఉంద‌ని.. స‌ద‌రు నేత ఫోన్‌కు వంద‌లాది ఫోన్‌కాల్స్ వ‌చ్చిన‌ట్లుగా పోలీసులు గుర్తించారంటూ ప్ర‌ముఖంగా వ‌చ్చిన వార్త‌ల‌పై మాజీ మంత్రి ఉమా మాధ‌వ‌రెడ్డి రియాక్ట్ అయ్యారు. పేప‌ర్ల‌లో త‌న పేరు రాకున్నా.. జాతీయ మీడియాలో మాత్రం త‌న పేరును ప్ర‌స్తావించిన వైనంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆమె.. న‌యిం వ్య‌వ‌హారంలో త‌మ‌కేమాత్రం సంబంధం లేద‌ని తేల్చారు. సిట్ మీద సందేహాలు ఉన్నాయ‌ని.. ఈ వ్య‌వ‌హారం మీద జ్యూడిషియ‌ల్ విచార‌ణ‌కు ఆదేశించాలంటూ ఆమె డిమాండ్ చేశారు. త‌మ కుటుంబాన్ని అప్ర‌దిష్ట పాలు చేయ‌టానికి.. త‌మ‌కు కావాల్సిన వారిని త‌ప్పించేందుకే తెలంగాణ ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని.. ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మాధానం చెప్పాల‌న్నారు.

మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను.. ఎలాంటి వ్య‌క్తిన‌న్న విష‌యం త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని.. త‌మ‌ను దెబ్బ తీసేందుకే ఇలాంటి లీకుల్ని ఇస్తున్నార‌న్న ఆమె.. నిజంగా ఆధారాలంటే బ‌య‌ట‌పెట్టాల‌ని.. త‌ప్పు చేసిన‌ట్లు తేలితే జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధ‌మ‌ని తేల్చి చెప్పారు. త‌న ఫోన్ నుంచి వంద‌లాది ఫోన్ కాల్స్ వెళ్లిన‌ట్లుగా వార్త‌ల్లో పేర్కొన్నార‌ని.. తాను మొద‌టి నుంచి ఒక‌టే ఫోన్ వాడుతున్నాన‌ని.. ఆ ఫోన్ నుంచి ఎన్ని ఫోన్ కాల్స్ న‌యింకు వెళ్లాయో.. ఎన్ని కాల్స్ వ‌చ్చాయో కాల్ డేటా మొత్తాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తుంటే.. ఒక సామాజిక వ‌ర్గాన్ని దెబ్బ తీసేందుకు కుట్ర ప‌న్నుతున్న‌ట్లుగా ఉంద‌న్న సందేహాన్ని వ్య‌క్తం చేశారు. త‌న భ‌ర్త మాధ‌వ‌రెడ్డికి ఉన్న మంచిపేరును చెడ‌గొట్ట‌టానికే ఇలాంటి దారుణ రాజ‌కీయాల‌కు తెర తీస్తున్నారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆమె.. ఒక మ‌హిళ అన్న‌ది కూడా చూడ‌కుండా త‌న‌పై జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని ఆమె తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. తాజాగా ఇస్తున్న లీకుల‌కు ఎవ‌రిది బాధ్య‌త అని ప్ర‌శ్నించిన ఆమె.. లీకుల్లో వ‌చ్చిన మ‌రో అంశాన్ని ప్ర‌స్తావించారు.

ప్ర‌స్తుతం భువ‌న‌గిరి ఎమ్మెల్యేగా ఉన్న నేత‌ను చంపాల‌ని తాను చెప్పిన‌ట్లుగా పేర్కొన్నార‌ని.. ఇదెంత అబ‌ద్ధ‌మ‌న్న ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆమె.. ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత తాను పెద్ద‌గా బ‌య‌ట‌కు రావ‌టం లేద‌ని.. ప్ర‌జ‌లు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో ఐదేళ్ల త‌ర్వాత చూసుకుందామ‌ని ఊరుకుంటే ఇలాంటి ప్ర‌చారం చేస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

త‌న భ‌ర్త మాధ‌వ‌రెడ్డికి ఉన్న మంచిపేరును చెడ‌గొట్ట‌టంతో పాటు.. త‌మ కుటుంబానికి ఉన్న పేరు ప్ర‌ఖ్యాతుల్ని దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. న‌యింతో సంబంధాలుఉన్న వారిని రక్షించుకోవ‌టానికే త‌మ‌ను టార్గెట్ చేస్తున్నార‌ని చెప్పిన ఆమె.. మిమ్మ‌ల్నే టార్గెట్ చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌న్న మీడియా ప్ర‌శ్న‌కు.. ఆ విష‌యం త‌మ‌కు తెలీద‌న్నారు. త‌మ‌ది సౌమ్య‌మైన కుటుంబంగా అభివ‌ర్ణించిన ఉమామాధ‌వ‌రెడ్డి.. త‌మ కుటుంబంపై జ‌రుగుతున్న కుట్ర‌ను తెలంగాణ ప్ర‌జ‌లు గుర్తించాల‌ని కోరారు. త‌న భ‌ర్త మ‌ర‌ణంతో ఇప్ప‌టికే నానా ఇబ్బందులు ప‌డుతున్న త‌మ‌ను మ‌రింత ఇబ్బంది పెట్టేందుకే ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తుంద‌న్నారు. లీకు వార్త‌ల్లో పేర్కొన్న‌ట్లుగా త‌క్ష‌ణ‌మే కాల్ డేటాను.. న‌యిం డైరీల‌ను బ‌య‌ట‌కు విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌కు ముఖ్య‌మంత్రే బాధ్య‌త వ‌హించాల‌న్న ఆమె.. మా కుటుంబం ఎలా క‌నిపిస్తోంది..? మేం ఏమైనా వ్యాపారాలు చేస్తున్నామా? ఇప్ప‌టివ‌ర‌కూ మా మీద సెటిల్‌మెంట్ల మ‌ర‌క ఉందా? అని ఫైర్ కావ‌టం గ‌మ‌నార్హం.