Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్‌ లోకి సండ్ర‌ - ఉమా మాధ‌వ‌రెడ్డి

By:  Tupaki Desk   |   18 Nov 2017 6:08 AM GMT
టీఆర్ ఎస్‌ లోకి సండ్ర‌ - ఉమా మాధ‌వ‌రెడ్డి
X
తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మ‌రో షాక్ ఖాయ‌మైంది. మ‌రో ఇద్ద‌రు ముఖ్యమైన నేత‌లు టీడీపీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో ఒక‌రు ఎమ్మెల్యే కాగా..మ‌రొక‌రు మాజీ మంత్రి కావ‌డం గ‌మ‌నార్హం. స‌త్తుప‌ల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక‌ట వీర‌య్య ఈ జాబితాలో ఉన్నారు. మాజీ మంత్రి ఉమా మాధ‌వ‌రెడ్డితో క‌లిసి డిసెంబ‌ర్ 9 న ఆయ‌న టీఆర్ ఎస్‌ లో చేర‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఇటు టీఆర్ ఎస్‌ - అటు టీడీపీ వ‌ర్గాల్లో జోరుగా ప్ర‌చారం సాగుతోంది.

అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి సీఎం కేసీఆర్‌ ను ఉమామాధ‌వ‌రెడ్డి కలిశారు. నక్సలైట్ల దాడిలో చనిపోయిన కుటుంబాలను ఆదుకోవాలని వినతిపత్రం అందించారు. నక్స‌ల్స్ బాధిత కుటుంబాల‌కు అందించే ఇంటి స్థ‌లాన్ని త‌న‌కు కేటాయించాల‌ని ఆమె కోరారు. అనంత‌రం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ తెలంగాణ‌లో టీడీపీ ఉనికిలో లేద‌ని అన్నారు. పార్టీ పూర్తిగా క‌ష్ట‌కాలంలోకి ప‌డిపోయింద‌ని చెప్పుకొచ్చారు. `కాంగ్రెస్‌ నుంచి రేవంత్‌ రెడ్డికి స్పష్టమైన హామీ లభించి ఉండవచ్చు. నాతో ఎవరు మాట్లాడకుండానే కాంగ్రెస్‌ లో ఎలా చేరతాను? హామీ ఇచ్చి ఉంటే రేవంత్‌ తోనే ఫ్లైట్‌ ఎక్కేదాన్ని. టీఆర్‌ ఎస్‌ లో చేరాలని గతంలో ఆహ్వానించారు. మళ్లీ పిలిస్తే ఆలోచిస్తా.` అని ఉమా మాధవరెడ్డి వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో మాజీమంత్రి - టీడీపీ సీనియర్‌ నేత ఉమా మాధ‌వ‌రెడ్డి టీఆర్ ఎస్‌ లో చేర‌డం ఖాయ‌మ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇది నిజం చేస్తూ వివిధ వ‌ర్గాలు డిసెంబ‌ర్‌9న ఆమె టీఆర్ ఎస్‌ లో చేర‌నున్నాయ‌ని ప్ర‌చారం చేస్తున్నాయి.