Begin typing your search above and press return to search.

ఎదురుదెబ్బకు దిగిన ఉక్రెయిన్

By:  Tupaki Desk   |   16 April 2022 4:01 AM GMT
ఎదురుదెబ్బకు దిగిన ఉక్రెయిన్
X
రష్యా దెబ్బనుండి తమను తాము కాపాడుకోవటంలోనే ఇంతకాలం అవస్తలు పడిన ఉక్రెయిన్ హఠాత్తుగా రష్యాపై ఎదురుదాడికి దిగింది. యుద్ధం మొదలైన సుమారు 45 రోజుల తర్వాత మొదటిసారిగా రష్యాపై ఉక్రెయిన్ హెలికాప్టర్లతో దాడులు చేయటం గమనార్హం. నల్లసముద్రంలో మోహరించిన రష్యా భారీ నౌక మాస్క్ వా సముద్రంలో ముణిగిపోయిన రెండో రోజే ఉక్రెయిన్ ఎదురుదాడికి దిగటంతో రష్యా తట్టుకోలేకపోతోంది.

రష్యా సరిహద్దుల్లో ఉన్న బ్రియాన్క్స్ ప్రాంతంలోని నివాసాలపై ఉక్రెయిన్ యుద్ధ హెలికాప్టర్లు దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100 ఇళ్ళు పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఎవరు చనిపోలేదని రష్యాయే స్వయంగా ప్రకటించింది. అయితే ఈ హెలికాప్టర్లు ఎంఐ-8ను ఉక్రెయిన్లోని చెర్న్ హివ్ ప్రాంతంలో తమ బలగాలు కూల్చేసినట్లు రష్యా ప్రకటించింది. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఉక్రెయిన్ యుద్ధ హెలికాప్టర్లను రష్యా కూల్చేసిందా లేదా అన్నది ప్రధానం కాదు. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి చేసిందా లేదా అన్నదే కీలకం.

దీనికి ప్రతీకారంగా రష్యా కూడా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై భీకరంగా దాడులు మొదలుపెట్టింది. ఖర్కీవ్, ఖేర్సన్ నగరాలపై రష్యా విమానాలు చేసిన దాడుల్లో కొందరు చనిపోయారు.

అయితే మేరియపోల్ నగరంలో ఉన్న ఓడరేవును స్వాధీనం చేసుకునేందుకు నానా అవస్తలు పడుతోంది. అయినా సరే రష్యా దాడులను ఉక్రెయిన్ దళాలు గట్టిగా ప్రతిఘటిస్తున్నాయి. దీనివల్లే రెండువైపుల నుండి దాడులు-ప్రతిదాడులు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్లోని సుమారు 22 వేలమంది పౌరులు చనిపోయినట్లు మేరియపోల్ మేయర్ వదీమ్ బాయ్ చెంకో ప్రకటించారు. నిజంగా ఈ ఫిగర్ వాస్తవం కాదని ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుందని విశ్లేషణలు వినబడుతున్నాయి.

ఉక్రెయిన్లోని చాలా నగరాలు రష్యా వైమానికాదాడుల వల్ల దాదాపు నాశనమైపోయాయి. యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరు చెప్పలేని స్ధితి. ఇపుడు నేలమట్టమైపోయిన నగరాలను పునర్ నిర్మించాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఎలాగైనా కీవ్ ను కూడా ధ్వంసం చేసేయాలని రష్యా సైన్యం తాజాగా డిసైడ్ చేసింది. అంటే యుద్ధం ముగింపుదశకు వచ్చేసినట్లు అనుకోవాల్సొస్తోంది. చూద్దాం చివరకు ఏమి జరుగుతుందో.