Begin typing your search above and press return to search.

షీనా బోరా కేసులో ట్విస్ట్ లే ట్విస్ట్ లు

By:  Tupaki Desk   |   22 Sep 2015 6:48 AM GMT
షీనా బోరా కేసులో ట్విస్ట్ లే ట్విస్ట్ లు
X
కన్న కూతురిని చంపేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఇంద్రాణి అంశానికి సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కుమార్తె షీనాబోరా కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న ఇంద్రాణికి ఊరట లభించే అంశాలు చోటు చేసుకోవటం గమనార్హం.

తన కుమార్తె.. షీనా బోరాను హత్య చేసి.. కాల్చేసిన ప్రాంతంలో గతంలో సేకరించిన ఆనవాళ్లకు.. తాజాగా సేకరించిన ఆనవాళ్లకు ఏ మాత్రం పొంతన లేదన్న విషయం బయటకు రావటం సంచలనం సృష్టిస్తోంది. షీనాబోరా కేసులో ఈ వ్యవహారం కీలకంగా మారటంతో పాటు.. ఇంద్రాణి కేసు నుంచి తప్పించుకునే వీలు ఉంటుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మరోవైపు.. బ్రిటీష్ ప్రతినిధి బృందం జైల్లో ఉన్న ఇంద్రాణిని కలవటం చర్చగా మారింది. దీనికి బ్రిటన్ బృందం చేస్తున్న వాదన ఏమిటంటే.. గతంలో కొద్దిరోజుల పాటు ఆమె బ్రిటన్ పౌరురాలిగా ఉందని.. ఈ నేపథ్యంలో తమ జాతీయురాలైన వ్యక్తికి జైల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.

ఇందులో భాగంగా ముంబయిలోని బ్రిటన్ బృందం ఇంద్రాణిని కలిసేందుకు అనుమతి కోరగా.. జైళ్లశాఖ ఒప్పుకోలేదు. దీంతో.. ఢిల్లీలోని బ్రిటన్ రాయబార బృందం సీన్ లోకి ఎంటరై.. అనుమతి పొందినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇంద్రాణిని రక్షించటంతో పాటు.. ఆమెను జైలు నుంచి విడుదల చేసే విధంగా పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నట్లుగా పలువురు అనుమానిస్తున్నారు. మరి.. ఏం జరుగుతుందో కాలమే బదులివ్వాలి.