Begin typing your search above and press return to search.

త‌మిళ నాట క‌రుణ వార‌సుడొచ్చేశాడు!

By:  Tupaki Desk   |   27 Jan 2018 10:55 AM GMT
త‌మిళ నాట క‌రుణ వార‌సుడొచ్చేశాడు!
X
త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో ఇప్పుడు రోజుకో కొత్త ప‌రిణామం చోటుచేసుకుంటోంది. అన్నాడీఎంకే అదినేత్రి - త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత ఆ రాష్ట్ర రాజ‌కీయాలు ర‌స‌కందాయంలో ప‌డిపోయాయి. జ‌య మాదిరిగా డేరింగ్ అండ్ డ్యాషింగ్‌గా ప‌నిచేసుకుపోయే నేత అన్నాడీఎంకేలో లేక‌పోవ‌డం, మ‌రో నాలుగేళ్ల దాకా ఆ రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగే ప‌రిస్థితి లేక‌పోవ‌డం - సీఎం ప‌ద‌వి చేప‌ట్టిన ఎడ‌ప్పాడి ప‌ళ‌నిసామి అంత బాగా రాణించ‌లేక‌పోవ‌డం - అదే స‌మ‌యంలో అక్క‌డి అయోమ‌య ప‌రిస్థితుల‌ను త‌న‌కు సానుకూలంగా మ‌ల‌చుకునేందుకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ త‌న‌దైన శైలిలో పావులు క‌దుపుతుండ‌టంతో ఇప్పుడు త‌మిళ రాజ‌కీయాలు నిజంగానే ఆసక్తిక‌రంగా మారిపోయాయి. అస‌లు ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఎప్పుడేం జ‌రుగుతుందో కూడా చెప్పలేని ప‌రిస్థితి ఉందంటే ఆశ్చ‌ర్యం కాదేమో.

అయితే జ‌య మ‌ర‌ణంతో త‌మిళ రాజ‌కీయాల్లో నెల‌కొన్న శూన్య‌త‌ను క్యాష్ చేసుకుని అవ‌కాశాలను అందిపుచ్చుకుందామ‌న్న భావ‌న‌తో రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేసిన త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌ - విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్‌ లు.. ఏ మేర‌కు రాణిస్తారో కూడా చెప్ప‌లేని ప‌రిస్థితి. అస‌లు వారిద్ద‌రిలో త‌మిళులు ఎవ‌రి బాట‌లో న‌డుస్తార‌న్న విష‌యం కంటే కూడా... వారిద్ద‌రిలో ఒక్క‌రినైనా ఆద‌రిస్తారా? అనే అనుమానాలు కూడా వ్య‌క్త‌మ‌వుతున్న ప‌రిస్థితి. ఇటీవ‌లే జ‌య సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్కే న‌గ‌ర్‌ కు జ‌రిగిన బైపోల్స్ ఫ‌లితాలే ఈ త‌ర‌హా అనుమానాల‌కు నిద‌ర్శ‌నంగా చెప్పుకొవ‌చ్చు.

జ‌య మ‌ర‌ణం త‌ర్వాత బీజేపీ నేత‌లు త‌మిళ‌నాడు చుట్టూ చ‌క్క‌ర్లు కొట్టినా... ఆర్కే న‌గ‌ర్‌ లో ఆ పార్టీ అభ్య‌ర్థికి డిపాజిట్ ద‌క్క‌క‌పోగా.. నోటాకు ప‌డ్డ ఓట్ల మేర కూడా ఓట్లు రాబ‌ట్ట‌లేక‌పోయారు. మొత్తానికి ప్రాంతీయ‌త‌కు ప్రాణాలిచ్చే త‌మిళ‌నాట త‌మ పప్పులు ఉడక‌వ‌ని బీజేపీకి అర్థ‌మైపోయిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇదే స‌మ‌యంలో ఓ యువ హీరో త‌మిళ నాట రాజ‌కీ తెరంగేట్రం చేసేశారు. ఆయ‌న ఎవ‌రో కాదు.. డీఎంకే అధినేత‌ - త‌మిళ‌నాడు మాజీ ముఖ్య‌మంత్రి క‌రుణానిధి మ‌న‌వ‌డు ఉద‌య‌నిధి స్టాలినే. డీఎంకే కార్యాధ్య‌క్షుడు ఎంకే స్టాలిన్ పుత్ర‌ర‌త్నంగా కంటే కూడా కోలీవుడ్‌ లో యువ హీరోగా - నిర్మాత‌గానే ఆయ‌న జ‌నానికి చిర‌ప‌ర‌చితులు. రాజ‌కీయ కుటుంబానికి చెందిన ఉద‌య‌నిధి మొన్న‌టిదాకా అస‌లు రాజ‌కీయాల గురించి మాట్లాడిందే లేదు. అయితే రెండు రోజుల క్రితం స్వ‌యంగా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ త‌న‌కు రాజ‌కీయాలంటే ఆస‌క్తి అని - త్వ‌ర‌లోనే రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని - పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించిన ఉద‌య‌నిధి.. ఈ రోజు ఉద‌యం ఏకంగా రంగంలోకి దిగేశారు.

త‌మిళ‌నాడులో ఆర్టీసీ బ‌స్సు చార్జీల పెంపును నిర‌సిస్తూ విప‌క్షం డీఎంకే నిర్వ‌హించిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో ఉద‌య‌నిధి ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ప్ర‌భుత్వానికి నిర‌స‌న తెలుపుతున్న‌ట్లుగా బ్లాక్ క‌ల‌ర్ ష‌ర్ట్ వేసుకుని రోడ్డు మీద‌కు వ‌చ్చిన ఉద‌య‌నిధి డీఎంకే త‌ర‌ఫున గొంతెత్తారు. ప్ర‌జ‌ల‌కు పెను భారంగా మారిన చార్జీల‌ను త‌క్ష‌ణ‌మే త‌గ్గించాల‌ని కూడా ఆయ‌న డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే... ఉద‌య‌నిథి స్టాలిన్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఆయ‌న మేన‌త్త‌, డీఎంకే ఎంపీ క‌నిమొళి హ‌ర్షం వ్య‌క్తం చేశారు. త‌న మేన‌ల్లుడు రాజ‌కీయాల్లోకి వ‌చ్చి స‌త్తా చాటాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లుగా ఆమె పేర్కొన్నారు. కోలీవుడ్ లో హీరోగానే కాకుండా నిర్మాత‌గా జోడు పాత్ర‌ల్లో మెరుగ్గానే రాణిస్తున్న ఉద‌య‌నిధి... డీఎంకే పార్టీ ప‌త్రిక ముర‌సోలి వ్య‌వ‌హారాల‌ను కూడా ప‌ర్య‌వేక్షిస్తున్నార‌ట‌. మొత్తానికి తన‌కు అప్ప‌టించిన అన్ని బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తూ.. అన్నింటా ప్ర‌తిభ చాటుతున్న ఉద‌య‌నిధి... రాజ‌కీయాల్లోనూ త‌న‌దైన స‌త్తా చాటుతార‌న్న వాద‌న వినిపిస్తోంది.