Begin typing your search above and press return to search.

అంతా తానై న‌డిపిన స్టాలిన్ కుమారుడు..!

By:  Tupaki Desk   |   25 Feb 2022 12:30 AM GMT
అంతా తానై న‌డిపిన స్టాలిన్ కుమారుడు..!
X
త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి వేగంగా ఎదుగుతున్నారు. సినీ న‌టుడిగా, ఎమ్మెల్యేగా ఇలా రెండు ప‌డ‌వ‌ల‌పై ప్ర‌యాణిస్తూ కూడా పార్టీని స‌మ‌న్వ‌యం చేస్తున్నారు. స్టాలిన్ త‌ర్వాత పార్టీ భ‌విష్య‌త్ రాజ‌కీయ వార‌సుడిగా రుజువు చేసుకుంటున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలోని కార్పొరేష‌న్లు, మున్సిపాలిటీలు, న‌గ‌ర పంచాయ‌తీల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఫ‌లితాలే ఉద‌య‌నిధి చ‌తుర‌త‌కు నిద‌ర్శ‌నంగా నిలిచాయి.

ఈ లోక‌ల్ బాడీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అధికార డీఎంకే పార్టీ ఏక‌ప‌క్షంగా నిలిచింది. రాష్ట్రంలోని మొత్త న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు, న‌గ‌ర పంచాయ‌తీల‌ను కైవ‌సం చేసుకుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను చిత్తు చేస్తూ అన్ని చోట్లా విజ‌య ఢంకా మోగించింది.

138 మున్సిపాలిటీల‌కు గానూ 133 స్థానాల‌ను సొంతం చేసుకుంది. దాదాపు 20 న‌గ‌రాల్లో ప్ర‌తిప‌క్ష పార్టీ అన్నాడీఎంకే ద‌రిదాపుల్లోనే లేకుండా పోయింది. ఇంత‌టి విజ‌యాన్ని డీఎంకే కూడా ఊహించ‌లేదట‌.

ముఖ్య‌మంత్రి స్టాలిన్ ఒక్క సారి కూడా ప్ర‌చారానికి వెళ్ల‌కుండానే ఏక‌ప‌క్ష ఫ‌లితాలను ఆ పార్టీ సాధించింది. దీనికంత‌టికీ ఉద‌య‌నిధే కార‌ణ‌మ‌ట‌. స్టాలిన్ కేవ‌లం త‌న ఇంట్లో నుంచే స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తూ పార్టీని విజ‌య‌ప‌థంలో న‌డిపించార‌ట‌.

కానీ, క్షేత్ర‌స్థాయిలో తీవ్రంగా కృషి చేస్తూ.. రాష్ట్రం మొత్తం ప‌ర్య‌టించి గెలుపు బాధ్య‌త‌ను ఉద‌య‌నిధి భుజాన‌కెత్తుకున్నార‌ట‌. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగి 10 నెల‌లు కూడా కాకుండానే ఈ ఫ‌లితాలు రావ‌డం అంద‌రూ ఊహించిందే అయినా.. ఇందులో ఉద‌య‌నిధి ప‌ట్టుద‌ల‌ను మ‌రువ‌లేనిద‌ట‌.

త‌న తండ్రి ప్ర‌చారానికి రాక‌పోయినా డీఎంకే యువ‌నేత ఉద‌య‌నిధి దీనిని స‌వాల్ గా తీసుకున్నారు. రాష్ట్రం మొత్తం ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను త‌నే మోశారు. పార్టీ సీనియ‌ర్ల స‌హ‌కారంతో ఎప్ప‌టిక‌ప్పుడు అభ్య‌ర్థుల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ముందుకు సాగారు.

ఇత‌ర అభ్యర్థుల ప్ర‌చారాన్ని కూడా గ‌మ‌నిస్తూ త‌న వ్యూహాలు మార్చుకున్నార‌ట‌. త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం చెపాక్ కు వెళ్ల‌కుండానే మంత్రాంగాన్ని న‌డిపారు. ప్ర‌చారంలో ఉద‌య‌నిధి ఉప‌యోగించిన ప‌ద‌జాలం కూడా ఓట‌ర్ల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంద‌ట‌.

డీఎంకే అక్ర‌మాల‌తో గెలిచింద‌ని బీజేపీ విమ‌ర్శించినా.. ఈ ఫ‌లితాలు ఊహించిన‌వి, కృత్రిమ‌మైన‌వి అని అన్నాడీఎంకే అన్నా.. డీఎంకే గెలుపులో ఉద‌య‌నిధి పాత్ర‌ను మ‌రిచిపోలేమ‌ని ఆ పార్టీ నేత‌లు భావిస్తున్నారు. త‌మ పార్టీకి భ‌విష్య‌త్తు రాజ‌కీయ వార‌సుడు దొరికాడ‌ని సంబ‌రాలు చేసుకుంటున్నారు. చూడాలి మ‌రి ఉద‌య‌నిధి ప‌రుగు ఎంత‌వ‌ర‌కు వెళుతుందో..!