Begin typing your search above and press return to search.

వ‌ర్షాను ఖాళీ చేసిన ఉద్ధ‌వ్ ఠాక్రే!

By:  Tupaki Desk   |   23 Jun 2022 5:31 AM GMT
వ‌ర్షాను ఖాళీ చేసిన ఉద్ధ‌వ్ ఠాక్రే!
X
మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు క్ష‌ణ‌క్ష‌ణం మారిపోతున్నాయి. శివ‌సేన సీనియ‌ర్ నేత‌, మ‌హారాష్ట్ర కేబినెట్ లో మంత్రి ఏక‌నాథ్ షిండే దాదాపు 35 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు బావుటా ఎగుర‌వేసిన సంగతి తెలిసిందే. ఏక‌నాథ్ షిండే ప్ర‌స్తుతం బీజేపీ అధికారంలో ఉన్న అసోంలో క్యాంప్ వేశారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కాంగ్రెస్, ఎన్సీపీల‌ను వ‌దిలిపెట్టి బీజేపీతో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌నేదే త‌న‌ది, త‌న‌తోపాటు ఉన్న ఎమ్మెల్యేల డిమాండ్ అని తేల్చిచెప్పారు.

మ‌రోవైపు ఉద్ద‌వ్ ఠాక్రే త‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌విపై ఏమాత్రం ఆస‌క్తి లేద‌ని.. శివ‌సైనికుల్లో ఎవ‌రైనా ముఖ్య‌మంత్రి కావ‌చ్చ‌ని వ్యాఖ్యానించారు. త‌న రాజీనామాను గ‌వ‌ర్న‌ర్ కు అంద‌జేయొచ్చ‌ని పేర్కొన్నారు. ఏకనాథ్ షిండే అయినా ముఖ్య‌మంత్రి కావ‌చ్చ‌ని.. అందుకు త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని చెబుతున్నారు. ముంబైలో ముఖ్య‌మంత్రి అధికారిక నివాసం వ‌ర్షాను ఖాళీ చేసి బాంద్రాలో ఉన్న త‌మ వ్య‌క్తిగ‌త నివాసం మాత్రోశ్రీకి ఉద్ధ‌వ్ ఠాక్రే వెళ్లిపోయారు.

మ‌రోవైపు జూన్ 22న సాయంత్రం నిర్వ‌హించిన శివ‌సేన ఎమ్మెల్యేల స‌మావేశానికి హాజ‌రుకాక‌పోతే వారి స‌భ్య‌త్యం ర‌ద్ద‌వుతుంద‌ని పార్టీ విప్ జారీ చేసింది. దీన్ని ఏక‌నాథ్ షిండే త‌ప్పుబ‌ట్టారు. విప్ జారీ చేసే అధికారం ఉద్ధ‌వ్ ఠాక్రేకు లేద‌ని తేల్చిచెప్పారు.

శివ‌సేన ఎమ్మెల్యేల్లో మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు త‌న‌తోనే ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు. అందువ‌ల్ల విప్ త‌మ‌కు వ‌ర్తించ‌బోద‌న్నారు. త‌మ వ‌ర్గంలోని ఒక‌రిని చీఫ్ విప్ గా నియ‌మించారు. శివ‌సేన పోరాటమంతా కాంగ్రెస్, ఎన్సీపీల‌తోనే మొద‌టి నుంచి జ‌రిగింద‌ని.. అలాంటి పార్టీల‌తో ఇప్పుడు ప్ర‌భుత్వం న‌డ‌ప‌డాన్ని శివ‌సేన నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ఏక‌నాథ్ షిండే అంటున్నారు.

ప్ర‌భుత్వంలో పెత్త‌న‌మంతా కాంగ్రెస్, ఎన్సీపీ నేత‌లే చేస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. శివ‌సేన‌ను చీల్చాల‌న్న‌ది త‌మ ఉద్దేశం కాద‌ని ఉద్ధ‌వ్ ఠాక్రే ఆ రెండు పార్టీల‌ను వ‌దిలి బ‌య‌ట‌కు రావాల‌ని పేర్కొంటున్నారు.

ప‌రిణామాలు ఇలా సాగుతుండ‌గానే ఇంకోవైపు ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్, ఆయ‌న కుమార్తె, ఎంపీ సుప్రియా సూలే.. ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేను క‌లిశారు. సీఎం ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని ఏక‌నాథ్ షిండేను ముఖ్య‌మంత్రిని చేయాల‌ని సూచించారు. మ‌హా అఘాడీ ప్ర‌భుత్వం నిల‌బ‌డాలంటే ఉద్ధ‌వ్.. ఏక‌నాథ్ ను సీఎంను చేయ‌డ‌మే మార్గ‌మ‌ని సూచించారు.