Begin typing your search above and press return to search.

మారుతున్న మ‌హా రాజ‌కీయాలు.. ఠాక్రే ఏం చేస్తారో..

By:  Tupaki Desk   |   27 May 2020 10:30 AM GMT
మారుతున్న మ‌హా రాజ‌కీయాలు.. ఠాక్రే ఏం చేస్తారో..
X
ఎన్సీపీ, కాంగ్రెస్, శివ‌సేనలు క‌లిసి మ‌హారాష్ట్ర‌లో ప్ర‌భుత్వం ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఈ ప్ర‌భుత్వానికి ప్ర‌మాదం ముంచుకొస్తోంది. సంకీర్ణంలో లుక‌లుక‌లు ఏర్ప‌డ్డాయి. పైగా త్వ‌ర‌లోనే ముఖ్య‌మంత్రిగా కొనసాగే అవ‌కాశం ఉద్ద‌వ్ ఠాక్రేకు లేదు. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న ఏ స‌భ‌లోనూ ప్ర‌తినిధి కాదు. సీఎంగా బాధ్య‌త‌లు స్వీక‌రించి త్వ‌ర‌లోనే ఆరు నెల‌లు అవుతుంది. ఈ లోపు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి వైదొలగాల్సిందే. అందుకే ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాలు హాట్ టాపిక్‌గా మారాయి.‌

దేశంలోనే అత్య‌ధికంగా మ‌హ‌మ్మారి వైర‌స్ వ్యాపిస్తోంది. పాజిటివ్ కేసులు దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 54,758 ఉన్నాయి. ఇప్పటివరకూ ఆ రాష్ట్రంలో వైర‌స్‌తో 1,792 మంది మృతిచెందారు. ఆ వైర‌స్ క‌ట్ట‌డి చ‌ర్య‌లు ప్ర‌భుత్వం స‌క్ర‌మంగా తీసుకో లేద‌ని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే భావిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ స‌డ‌లించాల‌ని సంకీర్ణ ప్రభుత్వంలో కీల‌క భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కోరుతున్నారు. ఈ నేప‌థ్యంలో సంకీర్ణ ప్రభుత్వంలో విబేధాలు మొద‌ల‌య్యాయ‌ని పుకార్లు వచ్చాయి. ఇదే స‌మ‌యంలో బీజేపీ నాయ‌కులు గ‌వ‌ర్న‌ర్ భగత్‌ సింగ్‌ కోష్యారీని క‌లిసి రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని కోరారు. దీంతో ఒక్క‌సారిగా మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయాలు మొద‌ల‌య్యాయి.

ఇలాంటి చ‌ర్చ జ‌రుగుతున్న స‌మ‌యంలోనే కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మ‌రింత ఇర‌కాటంలో పెట్టాయి. మహారాష్ట్రంలో తాము ప్రభుత్వానికి మద్దతునిస్తున్నామే త‌ప్పా నిర్ణయాలేవీ తమ చేతిలో లేవని చెప్పారు. దీంతో సంకీర్ణ ప్ర‌భుత్వంలో విబేధాలు వ‌చ్చాయ‌ని.. త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం కూల‌నుంద‌నే వార్త‌లు వినిపించాయి. దీనికి తోడు వైర‌స్ క‌ట్ట‌డి చేయ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోప‌ణాల‌తో ప్ర‌త్య‌ర్థులు ఇబ్బందులు సృష్టిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే రంగంలోకి దిగారు. న‌ష్ట నివార‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఇదే అంశంపై చర్చించడానికి బుధవారం ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులతో సమావేశం కానున్నారు. స‌మ‌న్వ‌యం చేసుకుని పాలిద్దామ‌ని చెప్ప‌నున్నారు. అయితే బీజేపీ ఎత్తుగ‌డల‌ను తిప్పికొట్టేందుకు స‌మ‌ష్టిగా ప‌ని చేద్దామ‌ని మిత్ర‌ప‌క్షాల‌ను కోర‌నున్నారు. ఏం నిర్ణ‌యం తీసుకోనున్నారో వేచి చూడాలి.