Begin typing your search above and press return to search.

పవన్ లాంగ్ మార్చ్.. వెనుక రెండు టార్గెట్స్

By:  Tupaki Desk   |   2 Nov 2019 9:18 AM GMT
పవన్ లాంగ్ మార్చ్.. వెనుక రెండు టార్గెట్స్
X
చలో విశాఖపట్నం.. జనసేనాని ఇచ్చిన ఈ పిలుపుతో ఇప్పుడు పవన్ ఫ్యాన్స్, జనసైనికులు అంతా విశాఖలో వాలిపోయారు. ఏపీలో ఇసుక కొరత అంశాన్ని ఒక అస్త్రంగా మలుచుకోవాలని.. జగన్ ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ పూరించిన ఈ సమరశంఖం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో వేడిపుట్టిస్తోంది. ‘లాంట్ మార్చ్’ అంటూ పవన్ కళ్యాణ్ చేసే ఈ ర్యాలీ సెగలు రేపుతోంది.

*పవన్ రెండు టార్గెట్స్
విశాఖలో లాంగ్ మార్చ్ నవంబర్ 3న ఎట్టిపరిస్థితుల్లోనూ విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ పట్టుదలగా ముందుకెళ్తున్నారు. ఏపీ రాజకీయాల్లో జనసేన ఉనికిని చాటాలని.. లాంగ్ మార్చ్ ను సక్సెస్ చేసి ప్రభుత్వం మెడలు వంచాలని భావిస్తున్నారు. ప్రజల సమస్యలపై పోరాటం అంటూ జగన్ ప్రభుత్వంపై లాంచ్ మార్చ్ కు రూపకల్పన చేసిన పవన్ టార్గెట్ అంతకుమించి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయంగా జనసేన మనుగడకు ఇది సవాల్ గా పవన్ ఈ పోరాటం తీర్చిదిద్దినట్టు ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యేనే గెలిపించుకోగలిగింది జనసేన. పవన్ సైతం ఘోరంగా ఓడిపోయారు. ఇప్పడు పార్టీ నేతలంతా ఒక్కరొక్కరుగా జనసేనకు రాజీనామాలు చేస్తూ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నిరుత్సాహ పడ్డ పార్టీ కేడర్ కు నూతనోత్సాహం నింపేందుకే పవన్ ఈ లాంగ్ మార్చ్ కు సిద్ధమయ్యారు. అందుకే ఇసుక కొరత పేరుతో పోరాటం చేసి కలిసి వచ్చిన ఈ అంశాన్ని వాడుకోవాలని పవన్ ప్లాన్ చేశారు.

ఇక లాంగ్ మార్చ్ వెనుక మరో లెక్క కూడా ఉందని జనసేన నేతల్లో చర్చ జరుగుతోంది. లాంగ్ మార్చ్ సక్సెస్ చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనైనా జనసేన పార్టీకి కాస్త గౌరవ ప్రదమైన స్థానాలు దక్కే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల ముందర ఈ ఆందోళన పార్టీకి మైలేజ్ తెచ్చే చర్యగా అభివర్ణిస్తున్నారు.

*వైసీపీ పై ఎత్తు
జనసేనాని రాజకీయ వ్యూహాలకు చిక్కవద్దని వైసీపీ భావిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో టీడీపీపై పక్షపాతం చూపి వైసీపీపై విమర్శలు చేసిన పవన్ ను ప్రజల్లో ఎండగట్టింది వైసీపీ. చంద్రబాబుకు పవన్ బీటీం అని జనంలోకి తీసుకెళ్లింది. ఇప్పుడు కూడా టీడీపీ మొదలుపెట్టిన ఇసుక కొరత ఉద్యమాన్ని పవన్ ముందుకు తీసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ చంద్రబాబు దర్శకత్వంలోనూ పవన్ నటిస్తున్నారంటూ విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ ఆరోపించారు. ఎన్నికల ముందు చేసిందే ఇప్పుడు చేస్తున్నాడని విమర్శించాడు. అదే వాదన వైసీపీ మళ్లీ తెరపైకి తెస్తోంది. టీడీపీ, జనసేన ఒకటేనని.. పవన్ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రెడీ అయ్యారు.