Begin typing your search above and press return to search.

తమ్ముడు మరణించాడని తెలిసి ఆ ఇద్దరు అక్కల గుండెలు ఆగిపోయాయి

By:  Tupaki Desk   |   25 July 2020 10:30 AM IST
తమ్ముడు మరణించాడని తెలిసి ఆ ఇద్దరు అక్కల గుండెలు ఆగిపోయాయి
X
ప్రేమ.. అభిమానాలు తగ్గిపోతున్నాయి. మానవసంబంధాలు చిధ్రమవుతున్నాయి. బంధాలు బండబారిపోతున్నాయి. కట్టుకున్న భార్యే భర్తను హతమార్చే పాడు రోజులు వచ్చాయి. కన్నకూతుర్ని కాటేసే దరిద్రపుగొట్టు తండ్రులు వచ్చారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. బంధాలు.. అనుబంధాలు అన్న వాటికి విలువ అంతకంతకూ తగ్గిపోతున్న వైనం ఇటీవల మరింత పెరిగింది.

వరుస పెట్టి వెలుగు చూస్తున్న ఉదంతాల నేపథ్యంలో.. నాటి ప్రేమ.. అభిమానం.. అప్యాయతలు.. బంధాల కోసం తల్లడిల్లే తీరు కనిపించని పరిస్థితి నెలకంది. ఇలాంటివేళలో.. వెలుగు చూసిన ఈ వైనం గురించి తెలిస్తే.. గుండె బరువెక్కుతుంది. ఆ అక్కాతమ్ముడి అనుబంధం కన్నీళ్లు తెప్పించక మానదు. కర్ణాటకలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అందరిని కదిలిస్తోంది. కర్ణాటకలోని బెళగావికి చెందిన 57 ఏళ్ల ఒక వ్యక్తి తీవ్రమైన గుండెనొప్పితో మరణించాడు. తమ్ముడి మరణ వార్త విన్నంతనే అతడి ఇద్దరు అక్కలు (ఒకరి వయసు 64 ఏళ్లు అయితే మరొకరిది 70 ఏళ్లు) గుండెలు ఆగిపోయిన వైనం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

బెళగావి సమీపంలో పంత్బలేకుంద్రి గ్రామానికి చెందిన అబ్దుల్ మాజిద్ కు ఇద్దరు అక్కలు. వారి ముగ్గురి మధ్య ప్రేమాభిమానాలు ఎక్కువ. అప్యాయతలకు లోగిళ్లుగా వారి కుటుంబాలు కనిపిస్తాయి. డయాబెటిస్ పేషెంట్ అయిన మాజిద్ ఇటీవల గుండె నొప్పి వచ్చింది. దీంతో.. అతడికి చికిత్స నిమిత్తం పలు ఆసుపత్రులు తిప్పాల్సి వచ్చింది. కోవిడ్ పరీక్ష నిర్దారణ అయ్యే వరకు ఎలాంటి చికిత్స చేయలేమన్న ఆసుపత్రుల పుణ్యమా అని.. వైద్యం జరగటంలో జరిగిన ఆలస్యంతో ఆయన మరణించారు.

తమ్ముడి మరణవార్త విన్నంతనే చిన్నక్క హుస్సేన్ బీ ముల్లా గుండెపోటుగా అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారు. తమ్ముడి మృతదేహాన్ని ఇంటికి తరలించే సమయంలోనే.. వారిద్దరి మరణవార్తవిన్న పెద్దక్క సహారాబీ కూడా గుండెపోటుకు గురయ్యారు. ఇలా ఒకే కుటుంబానికిసంబంధించి ఒకరి మరణం.. మరొకరి ప్రాణాల్ని తీసే అపురూప అనుబంధం గురించి తెలిసిన వారంతా షాక్ తింటున్నారు. వైద్యం కోసం పలు ఆసుపత్రులు తిరిగినప్పటికీ.. పరీక్ష చేయని కారణంగా వైద్యం చేయని సంగతి తెలిసిందే.ఇంతా చేస్తే.. అతడికి చేసిన కరోనా పరీక్షలో నెగిటివ్ గా తేలటం గమనార్హం.