Begin typing your search above and press return to search.

రజనీ పొలిటిక‌ల్ ఎంట్రీ..రెండు ఆప్ష‌న్ల‌లో దేనికి ఓటేస్తారో..!

By:  Tupaki Desk   |   13 Aug 2019 11:35 AM IST
రజనీ పొలిటిక‌ల్ ఎంట్రీ..రెండు ఆప్ష‌న్ల‌లో దేనికి ఓటేస్తారో..!
X
కేవలం తమిళనాడే కాకుండా దక్షిణ భారతదేశం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉందంటే అది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగ్రేటం. ఎప్పటి నుంచో ఆయన అభిమానులు రజనీని రాజకీయాల్లోకి రావాలని కోరుతూనే ఉన్నారు. ఇక అభిమానుల కోరిక మేరకు త్వరలోనే ఓ పార్టీ పెట్టి రాజకీయ అరంగ్రేటం చేయబోతున్నట్లు రజనీ చాలా సార్లు ప్రకటించారు. అయితే అది మాత్రం ఇంకా ఆచరణలోకి రాలేదు. ఇదుగో - అదుగో అంటూ కాలయాపన చేస్తున్నారే గానీ రజనీకాంత్‌ పార్టీ ఎప్పుడు పెడుతారో చెప్పడం లేదు.

ఇక 2021లో తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు తప్పనిసరిగా పార్టీ పెట్టి పోటీ చేస్తానని రజనీ అభిమానులకి నమ్మకం కలిగిస్తున్నారు. కానీ అభిమానులు రజనీ పార్టీ పెట్టె విషయంలో ఇంకా అనుమానాలతోనే ఉన్నారు. ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎన్నికల ముందు రజనీ పార్టీ పెట్టి పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ వరుస సినిమాల నేపథ్యంలో పార్టీ విషయం తేల్చలేదు.

ఇదిలా ఉంటే రజనీ కొత్త పార్టీ పెట్టకుండా బీజేపీలో చేరుతారనే ప్రచారం కూడా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి ఆయన బీజేపీకి మద్ధతుగానే మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఒక స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే కేంద్రంలో బీజేపీ రెండో సారి పాగా వేసింది. అలాగే ఇటీవల కశ్మీర్‌ వ్యవహారంతో 370 రద్దు వంటి కేంద్రప్రభుత్వ చర్యలను సమర్ధించారు.

ఇక సోమవారం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రహోంమంత్రి అమిత్‌ షాతో పాటు రజనీ కాంత్‌ పాల్గొని మోడీ - అమిత్‌ షాలను కృష్ణార్జునులుగా పేర్కొంటూ ప్రశంసల వర్షం కురించారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రజనీ బీజేపీలోకి కూడా వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది. పోనీ అలా కాకుంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ పెట్టి బీజేపీతో పొత్తు పెట్టుకోవచ్చని తెలుస్తోంది. అటు బీజేపీ-అన్నాడీఎంకె ల పొత్తు ఎలాగో ఉంది. దీనిలో రజనీ కూడా ఉండొచ్చు.

ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలో పోటీ చేసే అవకాశం ఉంది. అటు బీజేపీ ఎలాగో తమిళనాడులో పాగా వేయాలని చూస్తోంది. కాబట్టి అన్నాడీఎంకె-రజనీతో కలిసి పోటీ చేస్తే అది సాధ్యం కావొచ్చనే ఆలోచన చేస్తోంది. ఇక రజనీ ఇలా ముందుకెళితే తన చిరకాల మిత్రుడు కమల్ హాసన్ తో ఢీ అంటే ఢీ అనాల్సిన పరిస్తితి ఉంటుంది. కమల్ కి బీజేపీతో అసలు పడదు.

ఇటీవల కాశ్మీర్ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని కూడా కమల్ వ్యతిరేకించారు. అయితే రజనీకాంత్‌ తో కూటమికి సిద్ధం అనే సంకేతాలు కమల్ చాలా సార్లు పంపారు. అలాంటిది ఇప్పుడు రజనీకాంత్‌ బీజేపీ - అన్నాడీఎంకే పార్టీలతో పోత్తు పెట్టుకుంటే కమలహాసన్‌ ఆయనతో ఢీ కొనక తప్పదు. చూద్దాం మరి రానున్న రోజుల్లో తమిళనాడులో ఎలాంటి రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయో.