Begin typing your search above and press return to search.

టీడీపీ కి ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ .. చక్రం తిప్పిన ఆమంచి, ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి !

By:  Tupaki Desk   |   22 Jan 2020 11:09 AM IST
టీడీపీ కి ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్ .. చక్రం తిప్పిన ఆమంచి, ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి !
X
ఏపీ వికేంద్రీకరణ బిల్లుని ప్రభుత్వం నడిపిస్తున్న వైసీపీ, ఇటు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఈ రెండు పార్టీల బలబలాలకు కేంద్రబిందువైందీ. 151 మంది సభ్యులు ఉన్న శాసనసభలో ఈ బిల్లును అలవోకగా ఆమోదింపజేసుకున్న వైసీపీకి శాసనమండలిలో చెక్ పెట్టింది టీడీపీ . రూల్ 71ను తెరమీదికి తీసుకొచ్చి వైసీపీ కి షాక్ ఇచ్చింది. ముందు రూల్ 71 పైనే చర్చ జరగాలి అని పట్టుబట్టిన టీడీపీ ..మండలి లో తనకున్న బలాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుంది.

ఈ బిల్లుని మొదటి నుండి వ్యతిరేకిస్తున్న టీడీపీ ఎట్టకేలకి తన పంతం నెగ్గించుకుంది. ఏపీ శాసన మండలిలో రూల్ 71 నోటీస్ తీర్మానం నెగ్గింది. రూల్ 71కి మద్దతు గా 27 మంది టీడీపీ సభ్యులు ఓటేయగా.. 11 మంది వైసీపీ సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేశారు. మరో 9 మంది తటస్థం గా ఉన్నారు. వాస్తవానికి మండలిలో టీడీపీ బలం 32. ఐతే 27 మంది మాత్రమే రూల్ 71 నోటీస్‌ కు మద్దతు గా ఓటు వేశారు. ఓటింగ్ సందర్భంగా టీడీపీకి ఆ పార్టీ ఎమ్మెల్సీలు పోతుల సునీత మరియు శివనాథ రెడ్డి షాకిచ్చారు. టీడీపీ ఎమ్మెల్సీలంతా రూల్ 71 నోటీస్‌కు అనుకూలంగా ఓటేస్తే.. వీరిద్దరు మాత్రం వ్యతిరేకంగా ఓటు వేశారు. రాజకీయంగా తెలుగు దేశానికి జీవన్మరణ అంశం గా మారిన ఈ బిల్లు వ్యవహారం లో వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపే సాహసం ఎలా చేశారు? దీని వెనుక ఎవరు కారణం? అనే ప్రశ్నలు ఉత్సన్నమవుతున్నాయి.

తెలుగుదేశానికి చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు పోతుల సునీత మరియు శివనాథ రెడ్డి పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓటు వేయడం వెనుక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చక్రం తిప్పారనే వార్తలు వినిపిస్తున్నాయి. పోతుల సునీతది ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గమే. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పట్లో నవోదయం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమంచి కృష్ణ మోహన్ చేతిలో పరాజయాన్ని చవి చూశారు. ఆ తరువాత ఆమెను టీడీపీ అగ్ర నాయకత్వం మండలి కి పంపించింది. వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ ఒకే జిల్లా కావడం వల్ల ఆమంచితో సత్సంబంధాలే ఉన్నాయని చెప్తున్నారు. ఇక మరో ఎమ్మెల్సీ శివనాథ రెడ్డి రాయలసీమకు చెందిన నాయకుడు. రూల్ 71కు వ్యతిరేకంగా ఓటు వేయడం వెనుక స్థానిక రాజకీయాలే ప్రభావం చూపాయని చెబుతున్నారు. దీనికితోడు- వైఎస్ఆర్సీపీకి చెందిన రాయలసీమ నాయకులు ఆయన ను ప్రభావిం చేసి ఉండొచ్చని అంటున్నారు. అలాగే టీడీపీ ఏదైనా క్రమశిక్షణాచర్యలకు దిగినా కూడా తమ పార్టీలో రాజకీయ భవిష్యత్తు ను కల్పిస్తామంటూ వారు హామీ ఇచ్చారని తెలుస్తోంది. అయితే , టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బిల్లు పై వ్యతిరేకంగా ఓటు వేసిన ఈ ఇద్దరిపై తెలుగుదేశం పార్టీ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. రూల్ 71 తీర్మానం నెగ్గిన తర్వాత మండలి బుధవారానికి వాయిదా పడింది. నేడు సీఆర్డీఏ రద్దు, ఏపీ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పై చర్చ జరగనుంది.