Begin typing your search above and press return to search.

ఇద్దరు మంత్రులు అరెస్ట్​.. బెంగాల్​ లో టెన్షన్​.. మమత ఆగ్రహం..!

By:  Tupaki Desk   |   17 May 2021 3:00 PM IST
ఇద్దరు మంత్రులు అరెస్ట్​.. బెంగాల్​ లో టెన్షన్​.. మమత ఆగ్రహం..!
X
పశ్చిమబెంగాల్​ లో మరోసారి టెన్షన్​ వాతావరణం అలుముకున్నది. ఇప్పటికే పశ్చిమబెంగాల్​ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ గెలుపుకోసం అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ బెంగాల్​ లో మళ్లీ మమత గెలుపొందారు. ఇదిలా ఉంటే మమత గెలిచిన వెంబడే.. అక్కడ బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయి. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.

తాజాగా మరోసారి బెంగాల్​ లో రాజకీయవేడి రాజుకున్నది. మమతా బెనర్జీ హయాంలోని ఇద్దరు మంత్రులను సీబీఐ అరెస్ట్​ చేసింది. నారద స్టింగ్​ ఆపరేషన్​ కేసులో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
సోమవారం ఉదయం పశ్చిమబెంగాల్​ కు చెందిన మంత్రులు ఫిర్మాద్‌ హకీమ్‌, సుబ్రతా ముఖర్జీని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో బెంగాల్​లో టెన్షన్​ వాతావరణం అలుముకున్నది. కేంద్ర ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని తృణమూల్​ నేతలు ఆరోపిస్తున్నారు.


మరోవైపు కోల్​కతా లోని సీబీఐ కార్యాలయానికి మమతా బెనర్జీ వెళ్లారు. తనను కూడా అరెస్ట్​ చేయాలంటూ ఆమె సవాల్​ విసిరారు. సీబీఐ నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్​ చేస్తోందని.. ఓ మంత్రిని అరెస్ట్​ చేయాలంటే ముందుగా నోటీసులు ఇవ్వాలని కానీ సీబీఐ అటువంటి రూల్స్ ఏవీ పాటించలేదని ఆమె ఆరోపించారు.
మరోవైపు…తృణమూల్‌ ఎమ్మెల్యే మదన్‌ మిత్రా, ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మేయర్‌ సోవన్‌ ఛటర్జీ నివాసాలకు కూడా కేంద్ర బలగాలు చేరుకున్నాయి. వీరిని కూడా అరెస్ట్ చేసి సీబీఐ కార్యాలయానికి తరలించారు.

ఏమిటీ నారదా స్టింగ్​ ఆపరేషన్​?
2016 ఎన్నికల సమయంలో ‘నారద న్యూస్‌’ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా తృణమూల్​ కాంగ్రెస్​ కు చెందిన నలుగురు ఎంపీలు, నలుగురు మంత్రులు ఓ వ్యాపారవేత్త నుంచి డబ్బులు తీసుకున్నట్టు అప్పట్లో వీడియోలు బయటకు వచ్చాయి. ఈ ఘటనపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. ఈ స్టింగ్‌ ఆపరేషన్‌లో విచారణ చేయాలని ఇటీవలే బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ ఆదేశాలు ఇచ్చారు. తాజాగా ఈ కేసులో అరెస్ట్​ లు కొనసాగుతున్నాయి.

రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు..!

తృణమూల్​ మంత్రుల అరెస్ట్​తో పశ్చిమబెంగాల్​ లో నిరసనలు కొనసాగుతున్నాయి. టీఎంసీ కార్యకర్తలు, నేతలు నిరసనలు చేపడుతున్నారు. దాంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. అయితే ఈ విషయంపై సీబీఐ అధికారులు మాట్లాడుతూ.. గవర్నర్​ సూచనల మేరకు తాము అరెస్ట్​లు సాగించినట్టు సీబీఐ అధికారులు చెప్పుకొచ్చారు. కక్షసాధింపు ఏమీ లేదని స్పష్టం చేశారు.