Begin typing your search above and press return to search.

మ‌నోళ్లు ఇద్ద‌రికి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాలు

By:  Tupaki Desk   |   27 July 2018 5:21 AM GMT
మ‌నోళ్లు ఇద్ద‌రికి ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాలు
X
అంత‌ర్జాతీయంగా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే పుర‌స్కారాల‌కు సంబంధించి మ‌నోళ్లు ఇద్ద‌రిని వ‌రించింది. అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావించే రామ‌న్ మెగ‌సెసె పుర‌స్కారం ఈ ఏడాది ఇద్ద‌రు భార‌తీయుల‌కు ద‌క్కింది. వీధులే త‌న నివాసంగా భావించి తిరుగుతూ.. మాన‌సిక రోగుల‌కు సాంత్వ‌న క‌లిగించే విష‌యంలో విశేషంగా కృషి చేసిన మాన‌సిక వైద్య నిపుణుడు భ‌ర‌త్ ప‌ట్వాని.. దేశంలో ఓ మూల‌కు ఉండి.. పెద్ద‌గా ఎవ‌రూ దృష్టి సారించ‌ని ల‌దాఖ్ యువ‌లో విద్య‌.. జీవ‌న నైపుణ్యాలు మెరుగుప‌ర్చ‌టానికి కృషి చేసిన సోన‌మ్ వాంగ్ చుక్ కు ఈ విశేష పుర‌స్కారాలకు ఎంపిక‌య్యారు.

అంత‌ర్జాతీయంగా ఈ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్న వారిలో కంబోడియాకు చెందిన యూక్ చాంగ్.. తూర్పు తైమూర్ కు చెందిన మారియా డె లార్డెస్ మార్టిన్స్ క్రూజ్.. ఫిలిప్పీన్స్ కు చెందిన హౌవార్డ్ డీ.. వియ‌త్నాంకు చెందిన వోథి హువాంగ్ యెన్ రామ్ ల‌కుఈ పుర‌స్కారాలు ల‌భించాయి. ఆగ‌స్టు 31న ఫిలిప్పీన్స్ లో ఈ పుర‌స్కార వేడుక జ‌ర‌గ‌నుంది. ఇదిలా ఉంటే.. భార‌త్ కు చెందిన ఇద్ద‌రు భార‌తీయుల‌కు ల‌భించిన ఈ పుర‌స్కారం వారికే ఎందుకు వ‌చ్చింది.. వారి ప్ర‌త్యేక‌త ఏమిట‌న్న‌ది చూస్తే.. మ‌రింత స్ఫూర్తివంతంగా ఉంటుంద‌న‌టంలో సందేహం లేదు.

భ‌ర‌త్ ప‌ట్వానీ

ముంబ‌యికి చెందిన ఆయ‌న వీధుల్లో క‌నిపించే మాన‌సిక రోగుల‌కు త‌న ప్రైవేటు క్లినిక్ కు తీసుకెళ్లి సేవ‌లు అందించేవారు. అలాంటి రోగుల‌కు ఆయ‌న ఆశ్ర‌యం ఇచ్చేవారు. వైద్యంతో పాటు ఆహారాన్ని వారికి అందించేవారు. వారిని వారి కుటుంబాల వ‌ద్ద‌కు చేర్చ‌టానికి త‌న వంతు సాయం తాను చేసేవాడు. ఇందులో భాగంగా 1988లో ఆయ‌న శ్ర‌ద్ద రీహాబిలిటేష‌న్ ఫౌండేష‌న్ ను ఏర్పాటు చేశారు.

వాంగ్ చుక్‌

ఆయ‌న పేరు.. ఆయ‌న ఉండే ల‌ద్దాఖ్ పేరు విన్నంత‌నే ఏదో గుర్తుకు వ‌స్తున్న‌ట్లుగా ఉంది క‌దూ. నిజ‌మే.. మీ అంచ‌నా స‌రైన‌దే. బాలీవుడ్ సూప‌ర్ హిట్ ఫిలిం త్రీ ఇడియ‌ట్స్ లో అమిర్ ఖాన్ పాత్ర‌కు ఆయ‌నే స్ఫూర్తి. లేహ్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఐదు కుటుంబాలు మాత్ర‌మే ఉండే ఒక కుగ్రామంలో పుట్టిన ఆయ‌న తొమ్మిదేళ్ల వ‌య‌సు వ‌చ్చే వ‌ర‌కూ స్కూల్ అన్న‌ది చూసి ఎరుగ‌డు. ఊళ్లో స్కూల్ లేక‌పోవ‌టంతో త‌ల్లి ద‌గ్గ‌రే రాయ‌టం.. చ‌ద‌వ‌టం నేర్చుకున్నాడు. పొలాల్లో ఆడుకోవ‌టం.. విత్త‌నాల్ని నాట‌టం.. ప‌శువుల‌తో క‌లిసి ప‌ని చేయ‌టం లాంటి ప‌నులు చేసే అత‌గాడు తొమ్మిదేళ్ల వ‌య‌సులో స్కూల్లో చేరాడు.

శ్రీ‌న‌గ‌ర్ లోని నేష‌న‌ల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆయ‌న 19 ఏళ్ల వ‌య‌సులో ఇంజినీరింగ్ చ‌దివే వేళ‌లో ఫీజుల కోసం.. ఆ ప్రాంతంలోని మెట్రిక్యులేష‌న్ పిల్ల‌లు ఉత్తీర్ణులు కావ‌టానికి ట్యూష‌న్లు చెప్పేవారు. అనంత‌రం విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌టం కోసం ల‌ద్దాఖ్ లో సెక్ మాల్ స్థాపించి విద్యార్థుల‌కు శిక్ష‌ణ ఇవ్వ‌టం షురూ చేశారు. ఈ సినిమాలో మాదిరి వినూత్నంగా బోధించ‌టం ద్వారా విద్యార్థుల్లో సృజ‌న‌శీల‌త‌ను పెంచ‌టం ఆయ‌న గొప్ప‌త‌నంగా చెప్పాలి.