Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : పాకిస్థాన్ లో ఇద్దరు భారత దౌత్యవేత్తల మిస్సింగ్

By:  Tupaki Desk   |   15 Jun 2020 2:00 PM IST
బ్రేకింగ్ : పాకిస్థాన్ లో ఇద్దరు భారత దౌత్యవేత్తల మిస్సింగ్
X
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్ కి చెందిన ఇద్దరు అధికారులు కనబడడం లేదు. సోమవారం ఉదయం సుమారు ఎనిమిది గంటల ప్రాంతం నుంచి వారి ఆచూకీ తెలియడంలేదని సమాచారం. దీనిపై పాక్ ప్రభుత్వానికి భారత్ ఫిర్యాదు చేసింది.అధికార వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఇద్దరు అధికారులు ఇస్లామాబాద్‌లో కార్యాలయ పనులకు బయలుదేరారు, ఆ తర్వాత వారి నుంచి ఎటువంటి సమాచారం రావడం లేదు. రెండు మొబైల్‌ ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉన్నాయి. ఇదే విషయమై పాకిస్తాన్ అధికారుల్ని భారత్ సంప్రదించింది.

పాకిస్తాన్ లో పలువురు భారత దౌత్య ప్రతినిధులపై అనేక రోజులుగా నిఘా ఉంటోంది. దీనిపై భారత ప్రభుత్వం పలుమార్లు ఆ దేశానికి నిరసన కూడా తెలిపింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డిటెక్టివ్ ఒకరు...పాక్ లోని భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా కారును వెంబడిస్తున్నట్లు ఇటీవల ఓ వీడియో బయటపడింది. అదే సమయంలో, కొంత మంది అహ్లువాలియా ఇంటి వెలుపల కూడా కనిపించారు.

గత మే 31 న ఢిల్లీ కరోల్ బాగ్ లోని పాకిస్థానీ హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న అబ్ది హుసేన్ ఆబిద్ (42),తాహిర్ ఖాన్ (44) అనే ఇద్దరు అధికారులు గూడచర్యానికి పాల్పడుతూ భారత అధికారులకు పట్టుబడ్డారు. ఇందుకు వారిద్దరినీ ఈ నెల 1 న తిరిగి పాకిస్థాన్ కి పంపివేశారు. వీరు ఫేక్ ఇండియన్ ఐడెంటిటీలు గా చెప్పుకున్నారని, ఫేక్ ఆధార్ కార్డును ఉపయోగించారని తెలిసింది. వారి నుంచి రెండు యాపిల్ ఐ ఫోన్లను, 15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. బహుశా ఈ ఘటనకు, ఈ తాజా సంఘటనకు లింక్ ఉండవచ్చునని భావిస్తున్నారు.